దయ్యం నెపంతో తొక్కి చంపారు | Superstition Claims man's life in Adilabad District | Sakshi
Sakshi News home page

దయ్యం నెపంతో తొక్కి చంపారు

Published Tue, Jan 7 2014 1:40 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

దయ్యం నెపంతో తొక్కి చంపారు - Sakshi

దయ్యం నెపంతో తొక్కి చంపారు

నెన్నెల: మూఢ నమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మైలారంలో ఏడాది క్రితం చనిపోయిన వృద్ధురాలు దయ్యంగా మారి తమను వేధిస్తోందని ఆమె కొడుకును అదే గ్రామానికి చెందిన మహిళలు కొట్టి చంపారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన టేకం చిన్నయ్య(50) తల్లి మారక్క ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది.

అయితే, ఆమె దయ్యంగా మారి కొద్ది రోజులుగా వేధిస్తోందని దీంతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన ఎండల పద్మ, ప్రవళిక అనుమానం. దీంతో తమను రక్షించేందుకు దేవుడి మొక్కులు తీర్చాలని చిన్నయ్యతో వారు గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న చిన్నయ్యపై వారిద్దరూ దాడి చేశారు. అతన్ని విచక్షణ రహితంగా కాళ్లతో తొక్కి, స్పృహ కోల్పోయే వరకు కొట్టి వెళ్లిపోయారు.

అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆదివారం ఉదయం ఇరుగు పొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కరీంనగర్ వెళ్లేందుకు డబ్బుల్లేక వెనక్కి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య బాయక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement