Mylaram Village
-
మైలారంలో ఉద్రిక్తత.. పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా ముళ్లకంచె
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: బల్మూర్ మండలం మైలారం(Mylaram) గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మైనింగ్ వెలికితీతను నిలిపివేయాలంటూ గత మూడు నెలలుగా ఆ గ్రామ రైతులు(Farmers), ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు, ప్రజలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. దీంతో మహిళలను, రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అచ్చంపేటలో ఉన్న మైలారం గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కు నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామానికి పోలీసులు రాకూడదని.. గ్రామ ప్రధాన రహదారిపై ముళ్ళ కంచె వేసి పెద్ద ఎత్తున పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు.అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ రైతు ప్రయత్నం చేయగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణం విడుదల చేయకపోతే మందు తాగి చావడానికైనా సిద్ధమంటూ మందు డబ్బులతో రైతులు, మహిళలు రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు -
దయ్యం నెపంతో తొక్కి చంపారు
నెన్నెల: మూఢ నమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మైలారంలో ఏడాది క్రితం చనిపోయిన వృద్ధురాలు దయ్యంగా మారి తమను వేధిస్తోందని ఆమె కొడుకును అదే గ్రామానికి చెందిన మహిళలు కొట్టి చంపారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన టేకం చిన్నయ్య(50) తల్లి మారక్క ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, ఆమె దయ్యంగా మారి కొద్ది రోజులుగా వేధిస్తోందని దీంతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన ఎండల పద్మ, ప్రవళిక అనుమానం. దీంతో తమను రక్షించేందుకు దేవుడి మొక్కులు తీర్చాలని చిన్నయ్యతో వారు గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న చిన్నయ్యపై వారిద్దరూ దాడి చేశారు. అతన్ని విచక్షణ రహితంగా కాళ్లతో తొక్కి, స్పృహ కోల్పోయే వరకు కొట్టి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆదివారం ఉదయం ఇరుగు పొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కరీంనగర్ వెళ్లేందుకు డబ్బుల్లేక వెనక్కి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య బాయక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.