హ్యాట్రిక్ కాంబినేషన్
దర్శక-నిర్మాతల మధ్య మంచి అనుబంధం కుదిరితే దాదాపు హిట్ సినిమాలే వస్తాయి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ - దర్శకుడు త్రినాథరావు నక్కినలది అలాంటి కాంబినేషనే. ‘టాటా-బిర్లా-మధ్యలో లైలా’తో మొదలుపెట్టి ‘సినిమా చూపిస్త మావ’ వరకు పలు విజయ వంతమైన చిత్రాలు నిర్మించారు వేణుగోపాల్. వాటిలో త్రినాథరావుతో తీసిన ‘మేం వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్త మావ’ హిట్. ఇప్పుడు ఈ ఇద్దరూ మూడో చిత్రానికి శ్రీకారం చుట్టారు. దీని గురించి బుధవారం బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ‘‘నాని హీరోగా త్రినాథరావుతో ఓ సినిమా చేయనున్నా.
‘దిల్’ రాజు సంస్థ నిర్మించే ఈ చిత్రానికి నేను సహ నిర్మాతను. ప్రస్తుతం భాస్కర్ దర్శకత్వంలో హెబ్బా పటేల్‌తో ‘నేను- నా బాయ్‌ఫ్రెండ్స్’ నిర్మిస్తున్నాను’’ అన్నారు. త్రినాథ రావు మాట్లాడుతూ - ‘‘దర్శకుడిగా నాకు అవకాశాలిచ్చింది వేణుగోపాల్గారే. మా కాంబినేషన్లో చేయబోయే మూడో సినిమాతో హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రచయితలు భాస్కరభట్ల రవికుమార్, సాయికృష్ణ, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర పాల్గొన్నారు.