అలాంటి థ్రిల్లే కలిగింది - రామ్
‘‘మా పెదనాన్న రవికిశోర్‌గారు ‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వే నువ్వే’తీస్తున్న టైమ్‌లో నేను చెన్నైలో ఉండేవాణ్ణి. వాటిల్లోని డైలాగ్స్ పెదనాన్నగారు చెబుతుంటే ఆ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుని థ్రిల్ ఫీలయ్యేవాణ్ణి. ఈ సినిమా డైలాగ్స్ విన్నప్పుడు కూడా నాకలాంటి థ్రిల్లే కలిగింది’’ అని రామ్ చెప్పారు.
రామ్, కీర్తీ సురేశ్ జంటగా శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నేను...శైలజ’ పాటల ఆవిష్కరణ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల సీడీని రామ్ ఆవిష్కరించారు. సీనియర్ నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ-‘‘ఎనర్జీకి మారు పేరు రామ్.
అతనితో చేయడం చాలా బాగా అనిపించింది. ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన తెలుగు సినిమా ఇది’’అని తెలిపారు. సీనియర్ నరేశ్ మాట్లాడుతూ-‘‘ ‘ శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ ’ సినిమా దగ్గర నుంచి నాకీ సంస్థతో అనుబంధం ఉంది. ‘మస్కా’లో రామ్‌తో నటించాను. అతని ఎనర్జీ సూపర్బ్. నాకు స్క్రిప్ట్ తెలుసు.అతనిది చాలా కష్టమైన క్యారెక్టర్. రామ్ తప్ప ఈ క్యారెక్టర్ ఎవరూ చేయలేరు. రామ్‌కి మరో మైల్స్టోన్ మూవీ ఇది’’ అని చెప్పారు.
‘‘కిశోర్ , రామ్ లతో కలిసి ఓ కాఫీ షాప్‌లో కూర్చుని గంటన్నరలో ‘క్రేజీ ఫీలింగ్’ అనే పాటను రాశాను. ఈ పాటను కిశోర్ బాగా తెరకెక్కించారు’’ అని రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ , లగడపాటి శ్రీధర్, దర్శకుడు కరుణాకరన్, నటులు ప్రిన్స్, రోహిణి, శ్రీముఖి, తానియా హోప్, ప్రదీప్ రావత్, రచయితలు భాస్కరభట్ల, అనంత్‌శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.