తుమకూరులో మహిళ హత్య
తుమకూరు, న్యూస్‌లైన్ : నగరంలో పట్టపగలు ఓ వివాహితను వేటకొడవళ్లతో హతమార్చిన సంఘటన గురువారం తీవ్ర సంచలనం రేపింది. ఉదయం 11.45 గంటల సమయంలో నగరంలోని గాంధీనగర్‌లో ఎల్ఐసీ రోడ్డులో శాంతినగరకు వెళ్లే రైలుగేట్ ఎదురుగా ఉన్న ఇంటిలో ఈ దారుణం జరిగింది. వివరాలు... గాంధీనగర్‌లో నివాసముంటున్న సూర్యనారాయణబుద్దీ ఇంటికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కాలింగ్‌బెల్ కొట్టారు. ఆ సమయంలో సూర్యనారాయణ భార్య నిర్మల (48) తలుపు తీయగానే దుండగులు వేట కొడవలితో విరుచుకుపడ్డారు. అతిదారుణంగా ఆమెను నరికివేశారు.
అక్కడే ఉన్న పనిమనిషి జయమ్మ అడ్డుకోవడానికి యత్నించగా ఆమెను గాయపరిచారు. హత్య జరిగిన సమయంలో నిర్మల మామ మంజునాథ్ ఇంటిలోనే ఉన్నారు. మృతురాలి భర్త సూర్యనారాయణ గూళూరు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఐజీపీ అమర్‌కుమార్‌పాండే, జిల్లా ఎస్పీ రమన్‌గుప్తా, అడిషనల్ ఎస్పీ.హనుమంతరాయప్ప పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తిలక్‌పార్కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.