వెన్నుపోటు, లొంగుబాటు ఇదే బాబు చరిత్ర : వాసిరెడ్డి
సాక్షి, హైదారాబాద్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. సీఎంకు దుబాయ్ వెళ్లడానికి సమయం ఉంది కానీ, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే టైమ్ లేదంటూ దుయ్యబట్టారు. ఏపీలో ముఖ్యమంత్రి ఉన్నారో, లేదోనన్న అనుమానం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోందని అన్నారు. గత 12 రోజుల నుంచి సీఎం ఎందుకు మౌనంగా ఉంటున్నారని పద్మ ప్రశ్నించారు.
చంద్రబాబు అసమర్థత వల్లే ఆరుకోట్ల ఆంధ్రులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విషయంలో రాష్ట్రంలోని అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖం చూపించలేని స్థితిలో బాబు ఉన్నారంటూ దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబు వెనుకేసుకొచ్చారని ఆమె మండిపడ్డారు. ఆంధ్రులంటే ఆత్మాభిమానం, ఆంధ్రులంటే పౌరుషానికి ప్రతీకలని, అలాంటి ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించని చంద్రబాబుకు ఏశిక్ష వేయాలంటూ ప్రశ్నించారు.
వెన్నుపోటు, లొంగుబాటు చంద్రబాబు చరిత్ర అని వాసిరెడ్డి మండిపడ్డారు. ఆనాడు అధికారంలో ఉన్న ఎన్టీఆర్ను కుర్చీ దింపి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అధికారం ఇచ్చిన ప్రజలను వెన్ను పోటు పొడిచారని విమర్శించారు. అంతేకుండా ఓటుకు నోటు కేసులో తప్పించుకోవడానికే కేంద్రానికి లొంగిపోయారని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా 12రోజుల నుంచి కనిపించడం లేదని, అజ్ఞాతవాసంలో ఉన్నారని ఆమె ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కేంద్రాన్ని ఏమీ అనకపోయినా, తెలుగుదేశం ఎంపీలు ఏదో అన్నట్లుగా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్లో ఏపీకి జరిగన అన్యాయం గురించి తెలుగుదేశం ఎంపీలు ప్రశ్నించారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు ఏమి సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నప్పుడు ఎంపీలు వెనక నుంచి బల్లలు చరిచి తమ మద్దతు తెలిపిన విషయాన్ని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. తెలుగుదేశం ఎంపీలు డ్రామాలు బాగా ఆడుతున్నారని, వచ్చే ఏడాది అన్న నంది అవార్దులు వారికే అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ ఎంపీలు కలరింగ్ ఇవ్వడం మానుకోవాలంటూ వాసిరెడ్డి పద్మ సూచించారు.