మాధురీ దీక్షిత్‌కు నెస్లె భరోసా
ముంబై: మ్యాగీ నూడిల్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీ దీక్షిత్.. ఈ ఉత్పత్తుల నాణ్యత లోపాలకు సంబంధించి నోటీసులు రావడంతో కలత చెందారు. మాధురీ శనివారం నెస్లె అధికారులను కలసి వివరణ కోరారు.
మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై ఎలాంటి సందేహం అక్కర్లేదని నెస్లె అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. మ్యాగీ ఉత్పత్తులపై విమర్శలు రావడంతో తాను కలత చెందానని మాధురీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయంలో వివరణ కోరేందుకు నెస్లె అధికారులను కలిశానని, నాణ్యత విషయంలో వారు భరోసా ఇచ్చారని మాధురీ తెలిపారు. 'మ్యాగీ.. 2 మినిట్ నూడుల్స్' ప్రచారకర్తగా వ్యవహరించిన మాధురీకి హరిద్వార్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. మాధురితో పాటు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ప్రీతి జింటాలపైనా వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. మ్యాగీ నూడిల్స్‌లో అనుమతించిన మోతాదు కంటే అధికంగా సీసం వాడారని తేలడంతో వీరిపై కేసులు పెట్టారు.