నెస్లేకు మరో ఎదురు దెబ్బ
నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాగీ నూడిల్స్ వివాదం నుండి ఇప్పుడిప్పుడే బయట పడి మార్కెట్ లోకి మళ్లీ రంగ ప్రవేశం చేసిన వెంటనే నెస్లేకు సంబంధించిన మరో ఉత్పత్తిపై దుమారం మొదలైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆహార లాబొరేటరీ సంస్థ నిర్వహించిన శాంపిల్ టెస్ట్‌లో నెస్లే పాస్తా విఫలమైంది. పాస్తాలో మోతాదుకు మించిన సీసం పరిమాణం ఉన్నట్లు తేలిందని లాబొరేటరీ అధికారి అరవింద్ యాదవ్ తెలిపారు.
సాధారణంగా సీసం మోతాదు 2.5 పీపీఎం కు మించరాదు. అయితే పాస్తాలో శాంపిల్స్‌లో 6 పీపీఎం ఉన్నట్లు నిర్థారణ అయింది.
ఈ రిపోర్టు ప్రకారం నెస్లే పాస్తా ప్రొడక్ట్‌ను హానికరమైన అహార పదార్థాల జాబితాలో చేర్చారు. తమ పరిశీలనలో తేలిన ఫలితాలను లక్నో లాబొరేటరీకి పంపిన అధికారులు పాస్తాపై కోర్టులో కేసు నమోదు చేయడానికి అనుమతులు కోరారు.