net assets
-
మన ఎంపీలు మనకంటే 1400 రెట్లు సంపన్నులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఎన్నికలైనా పేదరిక నిర్మూలనే తమ అజెండా అని ఊదరగొట్టే నేతలు, ఓట్ల వేటలో పేదలను కౌగిలింతల్లో ముంచెత్తడం, వారి ఇంట్లో భోజనం చేయడం వంటి చర్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలపై నినాదాలు వల్లెవేసే ఎంపీల్లో అసలు పేదలను ప్రతిబింబించే నేతలు ఉన్నారా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. దేశ ప్రజల సగటు ఆదాయంతో లోక్‌సభ ఎంపీల సగటు రాబడితో పోలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మన ఎంపీలు మన ప్రజల కంటే 1400 రెట్లు అధిక రాబడిని ఆర్జిస్తున్నారని ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషించింది. 2004 నుంచి 2019 వరకూ ఎన్నికైన ఎంపీల నికర ఆస్తులను లెక్కగట్టడం ద్వారా ఈ గణాంకాలను వెలువరించింది. ఎంపీల సగటు ఆదాయం 2004-09లో కేవలం రూ 1.9 కోట్లు కాగా తర్వాతి కాలంలో రూ 5.06 కోట్లకు ఎగబాకగా 2014-19లో రూ 13 కోట్లకు ఎగిసింది. ఇక ప్రస్తుత 17వ లోక్‌సభ(2019-24)లో ఎంపీల సగటు ఆదాయం ఏకంగా రూ 16 కోట్లకు ఎగబాకింది. ఎంపీల సగటు ఆదాయం సామాన్య ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే ఇంత భారీ వ్యత్యాసం ఉండటానికి కారణం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు నిధుల కోసం స్వయంగా భారీగా వెచ్చించే అభ్యర్ధుల వైపు మొగ్గుచూపడంతో వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారని ఇది పేదలు, చట్టసభ సభ్యుల రాబడిలో తీవ్ర అసమానతలు పెరిగే స్దాయికి దారితీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వాల్లో పట్టుపెంచుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
హైదరాబాద్‌లో పెరుగుతున్న అపర కుబేరులు
న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో మల్టీ మిలియనీర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన దశాబ్దకాలంలో వీరి సంఖ్య 160 నుంచి 510కి పెరిగింది. వ్యక్తిగతంగా 62.5 కోట్ల రూపాయలు, అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులుగల వారిని మల్టీ మిలియనీర్లుగా లెక్కించారు. 2004లో హైదరాబాద్‌లో 160 మంది మల్టీ మిలియనీర్లు ఉండగా, 2014, డిసెంబర్ నెల ముగిసేనాటికి వారి సంఖ్య 510కి పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల మల్టీ మిలియనీర్లలో టాప్ 20 నగరాల జాబితాలో కూడా హైదరాబాద్ నగరం చోటు చేసుకోవడం మరో విశేషం. టాప్ 20 నగరాల్లో హైదరాబాద్‌తోపాటు, వాణిజ్య రాజధానిగా వాసికెక్కిన ముంబై, పుణె, దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాలు కూడా ఉన్నాయి. ఆసియా పసిఫిక్ టాప్ 20 నగరాల్లో వియత్నాంలోని హో చి మిన్ నగరం అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యకరం. ‘శరవేగంగా అపరకుబేరులను చేస్తున్న నగరాలు శీర్షికతో న్యూ వరల్డ్ వెల్త్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. శరవేగంగా అపర కుబేరుల సంఖ్య పెరుగుతున్న భారత్ నగరాల్లో పుణె అగ్ర స్థానంలో నిలిచింది. 2004, డిసెంబర్లో కేవలం 60 మంది మాత్రమే అపర కుభేరులుండగా ప్రస్తుతం వారి సంఖ్య 250కి చేరుకుంది. అంటే 317 శాతం పెరుగుదల కనిపిస్తోంది. తర్వాత స్థానంలో ముంబై నగరం నిలిచింది. ఆ నగరంలో ప్రస్తుతం 2,690 మంది అపర కుభేరులున్నారు. ఇక ఈ దశాబ్ద కాలంలో బెంగళూరులో వీరి సంఖ్య 140 నుంచి 440కి, ఢిల్లీలో 430 నుంచి 1,350, చెన్నైలో 130 నుంచి 390కి, కోల్‌కతాలో 210 నుంచి 570కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అపర కుభేరులున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో 1,83,500 మంది అపర కుభేరులున్నారు. 26, 600 మందితో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. 25,400 మందితో జర్మనీ తృతీయ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అపర కుభేరుల సంఖ్య దశాబ్దకాలంలో 71 శాతం పెరిగింది. దశాబ్దకాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక పురోగతిపై న్యూ వరల్డ్ హెల్త్’ సంస్థ అధ్యయనం జరిపింది. ఆ లెక్కల ప్రకారం 200 శాతం పురోభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో రష్యా, బ్రెజిల్, చైనా, భారత్, ఇండోనేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి. -
పీఎన్బీ లాభం 28% డౌన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చి క్వార్టర్లో రూ. 806 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,131 కోట్లతో పోలిస్తే ఇది 28% తక్కువ. రూ. 4,189 కోట్లమేర తాజా బకాయిలు(స్లిప్పేజెస్) నమోదుకాగా, వీటికి అదనంగా రూ. 263 కోట్లు జతకలసినట్లు బ్యాంక్ చైర్మన్ కేఆర్ కామత్ పేర్కొన్నారు. నికర మొండి బకాయిలకు(ఎన్పీఏలు) కేటాయింపులు 45% ఎగసి రూ. 2,139 కోట్లకు చేరడంతో లాభాలు ప్రభావితమైనట్లు తెలిపారు. నికర ఎన్పీఏలు 2.85%గా నమోదయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 11,553 కోట్ల నుంచి రూ. 12,498 కోట్లకు పుంజుకుంది. పూర్తి ఏడాదికి: పూర్తి ఏడాదికి(2013-14) కూడా బ్యాంక్ నికర లాభం దాదాపు 30% క్షీణించి రూ. 3,343 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) రూ. 4,748 కోట్ల లాభం నమోదైంది. ఇక ఆదాయం మాత్రం రూ. 46,109 కోట్ల నుంచి రూ. 47,800 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 4% పతనమై రూ. 800 వద్ద ముగిసింది.