న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో మల్టీ మిలియనీర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన దశాబ్దకాలంలో వీరి సంఖ్య 160 నుంచి 510కి పెరిగింది. వ్యక్తిగతంగా 62.5 కోట్ల రూపాయలు, అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులుగల వారిని మల్టీ మిలియనీర్లుగా లెక్కించారు. 2004లో హైదరాబాద్‌లో 160 మంది మల్టీ మిలియనీర్లు ఉండగా, 2014, డిసెంబర్ నెల ముగిసేనాటికి వారి సంఖ్య 510కి పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ మంగళవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల మల్టీ మిలియనీర్లలో టాప్ 20 నగరాల జాబితాలో కూడా హైదరాబాద్ నగరం చోటు చేసుకోవడం మరో విశేషం. టాప్ 20 నగరాల్లో హైదరాబాద్‌తోపాటు, వాణిజ్య రాజధానిగా వాసికెక్కిన ముంబై, పుణె, దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై నగరాలు కూడా ఉన్నాయి. ఆసియా పసిఫిక్ టాప్ 20 నగరాల్లో వియత్నాంలోని హో చి మిన్ నగరం అగ్రస్థానంలో ఉండడం ఆశ్చర్యకరం.
‘శరవేగంగా అపరకుబేరులను చేస్తున్న నగరాలు శీర్షికతో న్యూ వరల్డ్ వెల్త్ తన అధ్యయన నివేదికను విడుదల చేసింది. శరవేగంగా అపర కుబేరుల సంఖ్య పెరుగుతున్న భారత్ నగరాల్లో పుణె అగ్ర స్థానంలో నిలిచింది. 2004, డిసెంబర్‌లో కేవలం 60 మంది మాత్రమే అపర కుభేరులుండగా ప్రస్తుతం వారి సంఖ్య 250కి చేరుకుంది. అంటే 317 శాతం పెరుగుదల కనిపిస్తోంది. తర్వాత స్థానంలో ముంబై నగరం నిలిచింది. ఆ నగరంలో ప్రస్తుతం 2,690 మంది అపర కుభేరులున్నారు. ఇక ఈ దశాబ్ద కాలంలో బెంగళూరులో వీరి సంఖ్య 140 నుంచి 440కి, ఢిల్లీలో 430 నుంచి 1,350, చెన్నైలో 130 నుంచి 390కి, కోల్‌కతాలో 210 నుంచి 570కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అపర కుభేరులున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో 1,83,500 మంది అపర కుభేరులున్నారు. 26, 600 మందితో చైనా ద్వితీయ స్థానంలో ఉంది. 25,400 మందితో జర్మనీ తృతీయ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా అపర కుభేరుల సంఖ్య దశాబ్దకాలంలో 71 శాతం పెరిగింది.
దశాబ్దకాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక పురోగతిపై న్యూ వరల్డ్ హెల్త్’ సంస్థ అధ్యయనం జరిపింది. ఆ లెక్కల ప్రకారం 200 శాతం పురోభివృద్ధి సాధించిన దేశాల జాబితాలో రష్యా, బ్రెజిల్, చైనా, భారత్, ఇండోనేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో పెరుగుతున్న అపర కుబేరులు
Published Tue, Mar 31 2015 7:10 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement