సాక్షి, న్యూఢిల్లీ : ఏ ఎన్నికలైనా పేదరిక నిర్మూలనే తమ అజెండా అని ఊదరగొట్టే నేతలు, ఓట్ల వేటలో పేదలను కౌగిలింతల్లో ముంచెత్తడం, వారి ఇంట్లో భోజనం చేయడం వంటి చర్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అల్పాదాయ వర్గాలను ఆకట్టుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలపై నినాదాలు వల్లెవేసే ఎంపీల్లో అసలు పేదలను ప్రతిబింబించే నేతలు ఉన్నారా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి.
దేశ ప్రజల సగటు ఆదాయంతో లోక్‌సభ ఎంపీల సగటు రాబడితో పోలిస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. మన ఎంపీలు మన ప్రజల కంటే 1400 రెట్లు అధిక రాబడిని ఆర్జిస్తున్నారని ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ విశ్లేషించింది. 2004 నుంచి 2019 వరకూ ఎన్నికైన ఎంపీల నికర ఆస్తులను లెక్కగట్టడం ద్వారా ఈ గణాంకాలను వెలువరించింది.
ఎంపీల సగటు ఆదాయం 2004-09లో కేవలం రూ 1.9 కోట్లు కాగా తర్వాతి కాలంలో రూ 5.06 కోట్లకు ఎగబాకగా 2014-19లో రూ 13 కోట్లకు ఎగిసింది. ఇక ప్రస్తుత 17వ లోక్‌సభ(2019-24)లో ఎంపీల సగటు ఆదాయం ఏకంగా రూ 16 కోట్లకు ఎగబాకింది. ఎంపీల సగటు ఆదాయం సామాన్య ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే ఇంత భారీ వ్యత్యాసం ఉండటానికి కారణం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దసంఖ్యలో పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమేనని విశ్లేషకులు పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలు నిధుల కోసం స్వయంగా భారీగా వెచ్చించే అభ్యర్ధుల వైపు మొగ్గుచూపడంతో వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా చట్టసభల్లో అడుగుపెడుతున్నారని ఇది పేదలు, చట్టసభ సభ్యుల రాబడిలో తీవ్ర అసమానతలు పెరిగే స్దాయికి దారితీస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తమ పనులు చక్కబెట్టుకునేందుకు ప్రభుత్వాల్లో పట్టుపెంచుకునేందుకు పారిశ్రామికవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment