2020 నాటికి నెట్ విప్లవం!
♦ 73 కోట్లకు చేరనున్న నెటిజన్లు
♦ నెట్ వ్యాప్తితో ఈ కామర్స్ జోరు
♦ ‘నాస్కామ్-అకమయి’ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: నెట్ వినియోగం దేశీయంగా పరుగులు పెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం నెట్ వినియోగం పెరుగుతుండడంతో 2020 నాటికి నెటిజన్ల సంఖ్య రెట్టింపు కంటే అధికమై 73 కోట్లకు చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. 2015 చివరి నాటికి దేశంలో నెట్ యూజర్లు 35 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. భారత్‌లో ఇంటర్నెట్ భవితవ్యం పేరుతో నాస్కామ్, అకమయి టెక్నాలజీస్ కలసి ఈ మేరకు ఓ నివేదిక రూపొందించాయి. ఇంటర్నెట్ వినియోగదారుల పరంగా చైనా తర్వాతి స్థానంలో ఉన్న దేశీయ మార్కెట్... వృద్ధి చెందుతుందని నివేదిక స్పష్టం చేసింది.
నివేదికలోని అంశాలు
⇔ ఇంటర్నెట్ వ్యాప్తి ఆన్లైన్ షాపింగ్ వృద్ధికి ఇంధనంలా పనిచేస్తుంది. 2015-16 నాటికి దేశీయ ఈ కామర్స్ మార్కెట్ 17 బిలియన్ డాలర్లు ఉండగా... 2020 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
⇔ 2020 నాటికి స్మార్ట్ఫోన్ల సంఖ్య 70 కోట్లకు విస్తరిస్తుంది. దీంతో ఆన్లైన్ షాపింగ్‌కు స్మార్ట్‌ఫోన్ ప్రాధాన్య వస్తువుగా మారుతుంది. మొత్తం ఆన్లైన్ షాపింగ్‌లో 70 శాతం స్మార్ట్ఫోన్ల వాటానే.
వర్క్ వీసాలపై ట్రంప్ వ్యాఖ్యలు సరికాదు...
వర్క్ వీసాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వినిపిస్తున్న వ్యాఖ్యలపై నాస్కామ్ సీరియస్‌గా స్పందించింది. అమెరికా చర్యలు పూర్తి వివక్షాపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భారతీయులు ఎక్కువగా పొందే హెచ్1బీ వీసాలకు కనీస వేతన పరిమితి పెంచాలంటూ తాజాగా చేసి న ప్రతిపాదన నేపథ్యంలో నాస్కామ్ స్పందిస్తూ... ‘‘ప్రతి దాన్నీ వాక్చాతుర్యం కోణంలో కాకుండా ఆచరణాత్మకంగానూ చూడాలి. వీసాల అంశంలో ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అవి వివక్షాపూరితమే కాదు, ఐటీ రంగానికి నష్టాన్ని కలిగించేవి కూడా. వీటి ఫలితంగా పరిశ్రమకు వ్యయం పెరిగి పోయింది’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. కాగా దేశీయ ఐటీ పరిశ్రమ ఎగుమతు లు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10-12% వృద్ధి ఉంటుందన్న అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది.