కరువు నేలకు కొత్తకాంతులు
నెరవేరుతున్న దశాబ్దాల కల
నేడు 4ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవం
4.30లక్షల ఎకరాలకు సాగునీరు
ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
తీరనున్న వలస బతుకుల కష్టాలు
జూరాల: కాగితాలకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులకు ప్రాణం వచ్చింది. సాగునీరు లేక భూములు బీళ్లుగా మారి కూలీ పనుల కోసం వలసబాట పట్టిన రైతుల తలరాతలు మారే ఘడియలు వచ్చాయి. దాదాపు 15 లక్షల మంది వలసబాట పట్టి దేశంలోనే రికార్డు సృష్టించిన పాలమూరు రైతుల బతుకులు మారాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు పెండింగ్ ప్రాజెక్టుల పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ ఖరీఫ్ నుంచే 4.30లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ ఖరీఫ్ నుంచే జిల్లాలోని 4.3లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుంది. జిల్లాలో గురువారం విస్తృతంగా పర్యటించి ఐదుచోట్ల నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులను ప్రారంభించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలు సందర్భాల్లో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో మొదటి ప్రాధాన్యం అత్యంత నిర్లక్ష్యానికి గురైన పాలమూరు జిల్లాకే దక్కాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. జిల్లాలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలని తపించారు. ప్రాజెక్టుల రీడిజైన్లలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకే తొలి శంకుస్థాపన చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయ్యేలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు మంజూరు చేశారు. పాత బిల్లులు కూడా చెల్లించారు. పరిపాలనపరమైన జాప్యాన్ని నివారించారు. ఫలితంగా 2005లో జలయజ్ఞంలో భాగంగా చేపట్టినప్పటికీ నత్తనడకన పనులు నడుస్తున్న భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులు పరుగు అందుకున్నాయి.
దగ్గరుండి పర్యవేక్షించిన హరీశ్‌రావు
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టడానికి ప్రాజెక్టుల వద్ద నిద్ర చేసి మరీ పనులు చేయించారు మంత్రి హరీశ్‌రావు. ఈ పథకాలకు అవసరమైన భూసేకరణ విషయంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. భూ నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించారు. కొన్నిచోట్ల సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాలువలకు అంతరాయంగా ఉన్న రైల్వే సమస్యలను రైల్వే అధికారులతో నిరంతరం చర్చించి పరిష్కరించారు. కాంట్రాక్టర్లు అధికారులతో పలుమార్లు సమావేశమై ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాలను అన్వేషించారు. కారణాలు తెలిసిన తర్వాత వాటి పరిష్కారానికి చొరవ చూయించారు. దాదాపు ప్రతి ప్రాజెక్టులోని లిఫ్టులు, పంప్‌హౌస్‌లు, కాలువలు, పైప్‌లను స్వయంగా పరిశీలించారు. ప్రాజెక్టుల పనులు జరుగుతున్న చోటే నిద్రచేసి అక్కడి కాంట్రాక్టర్లు, అధికారులు, టెక్నీషియన్లు, కూలీలతో మాట్లాడారు. వారిలో ఉత్సాహం నింపి, పనులు త్వరితంగా జరిగేలా చూశారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ తయారు చేసి ప్రతిక్షణం ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకున్నారు. ప్రతిరోజు పాలమూరు ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. ఇన్ని ప్రయత్నాల తర్వాత ప్రాజెక్టుల పనులు అనుకున్న రీతిలో పూర్తి దశకుచేరుకున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌కు ఎట్టి పరిస్థితుల్లోసాగునీరు ఇవ్వాలన్నదే లక్ష్యం నిర్ణయించుకొని దాన్ని చేరుకోవడానికి పట్టుదలతో పనిచేశారు. తాను స్వయంగా చొరవచూపి పూర్తి చేయించిన పనులను తానే స్వయంగా పరిశీలించి గురువారం ప్రారంభించి రైతులకు, పవిత్ర కృష్ణాజ లాలను అందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. కష్టపడి పనిచేసిన lఅధికారులు ప్ర«భుత్వ ప్రాధాన్యతను, పాలమూరు ప్రజల అవసరాలను గుర్తించిన నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు కూడా ఈ రెండేళ్ల సమయంలో ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి అందించిన ప్రత్యేక సహకారంతో అధికారులు, ఇంజనీర్లు శక్తివంచన లేకుండా పనిచేశారు. రికార్డు టైములో పనులు పూర్తిచేసి రైతులకు మేలు చేశారు.
ప్రారంభోత్సవాలు ఇలా...
భీమా, ఎత్తిపోతల పథకం ఆత్మకూరు మండలం నందిమళ్ల లో ఉదయం 9గంటలకు పార్లర్ కెనాల్, కొత్తకోటలో మధ్యాహ్నం 12గంటలకు స్టేజ్–2 ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం ఆయకట్టు 2లక్షల ఎకరాలు. గురువారం నుంచి నీరందే ఆయకట్టు 1.40లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– మక్తల్, దేవరకద్ర, వనపర్తి, కొల్లాపూర్.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ధరూరు మండలం ర్యాలంపాడులో ఉదయం 10.30గంటలకు రెండో లిఫ్టు ప్రారంభోత్సవం జరుగుతుంది. మొత్తం ఆయకట్టు 2లక్షల ఎకరాలు. గురువారం నుంచి నీరందించే ఆయకట్టు 1.20లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– అలంపూర్, గద్వాల.
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం నర్వ మండలం నాగిరెడ్డిపల్లిలో సాయంత్రం 3గంటలకు లిఫ్ట్–1 ప్రారంభోత్సవం జరుగుతుంది. ధన్వాడ మండలం సీలేరులో సాయంత్రం 4గంటలకు లిఫ్ట్–2 ప్రారంభోత్సవం జరుగుతుంది. మొత్తం ఆయకట్టు 50వేల ఎకరాలు. గురువారం నీరందించే ఆయకట్టు 20వేల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు–నారాయణపేట, మక్తల్, దేవరకద్ర.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొత్తం ఆయకట్టు 3.65లక్షల ఎకరాలు. ఈ ఏడాది నీరందే ఆయకట్టు 1.50లక్షల ఎకరాలు. 2017 ఖరీఫ్ నాటికి మొత్తం ఆయకట్టుకు నీరందుతుంది. సాగునీరందే నియోజకవర్గాలు– కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి.