హంస వాహనంపై గోవిందుడి చిద్విలాసం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతి శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు చిన్నశేష వాహనాన్ని అధిరోహించి భక్తులకు కనువిందు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం సర్వాంగ శోభితుడై స్వామివారు చిన్నశేష వాహనంలో కొలువుదీరి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. స్వామివారి వాహనం ముందు భక్త బృందాలు ప్రదర్శించిన కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల సేవ చేశారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు హంస వాహనంపై స్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. షడగోప రామానుజ పెదజీయంగార్, గోవింద రామానుజ చిన్నజీయర్, టీటీడీ స్థానికాలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూ డో రోజైన శుక్రవారం ఉదయం సింహ, రాత్రి ముత్యపు పందరి వాహన సేవలు జరుగనున్నాయి.