వెయ్యినోట్లు ఇప్పట్లో రావు
కొత్త డిజైన్తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ఇప్పట్లో లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశంలో మొత్తం 2 లక్షల ఏటీఎం మిషన్లు ఉండగా.. వాటిలో 10 శాతం అంటే, దాదాపు 22,500 ఏటీఎంలను గురువారం నాడు రీకాలిబరేట్ చేసి, వాటి నుంచి కొత్త రూ. 2000 నోటు సహా అన్నింటినీ విత్డ్రా చేసుకోడానికి వీలుగా తయారుచేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి వాటి నుంచి 100 రూపాయలతో పాటు కొత్త 500, 2000 రూపాయల నోట్లను కూడా విత్డ్రా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
బ్యాంకులలో నగదు మార్పిడి నిబంధనను రూ. 4500 నుంచి రూ. 2వేలకు ఎందుకు తగ్గించారని మీడియా ప్రశ్నించగా.. అందుబాటులో ఉన్న నిధుల దుర్వినియోగం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సామాన్యులకు ఊరట కలిగించేందుకే పెళ్లి సందర్భంగా ఖర్చుల కోసం రూ. 2.5 లక్షలు తీసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన చెప్పారు.