మాల్ మయసభ
భారతంలో మయసభ ఉందంటారు. అలాంటి వింతలు, విడ్డూరాల వంటివే ఈ చైనా షాపింగ్ మాల్లోనూ ఉన్నాయి.
వింటే భారతం వినాలి... తింటే గారెలు తినాలన్నది తెలుగు సామెత. దీనికి ఇప్పుడు.. ‘చూస్తే చైనానే చూడాలన్న’ వాక్యాన్ని జోడించుకోవాలేమో. ఎందుకంటారా? ఫొటో చూడండి మీకే అర్థమవుతుంది. ఏ పనైనా, భవనమైనా భారీగా, గ్రాండ్‌గా చేయడం చైనాకు అలవాటుగా... ఆ జాబితాలోకి చేరిందే ఈ న్యూ సెంచురీ గ్లోబల్ సెంటర్లోని కాంక్రీట్ బీచ్. దీని సంగతి కాసేపు పక్కనబెడదాం. ఈ గ్లోబల్ సెంటర్ ఉందే... అది కూడా చాలా పెద్దది.
అంకెల్లో చెప్పాలంటే దాదాపు 17,60,000 చదరపు మీటర్ల విశాలమైందన్నమాట. కొన్ని వందల దుకాణాలు, హోటళ్లు, కార్యాలయాలు, సినిమాహాళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్‌లు ఉన్న ఈ సూపర్ షాపింగ్‌మాల్‌కు అదనపు అట్రాక్షన్ కాంక్రీట్ బీచ్. సముద్ర తీరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో చెంగ్డూ నగరంలో ఉన్న కాంక్రీట్ బీచ్‌లో కొన్ని వందల మంది హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అప్పుడప్పుడూ ఎగసిపడే అలల్లో జలకాలాడవచ్చు... స్కీయింగ్ చేయవచ్చు... కావాలంటే సర్ఫింగ్కూ అవకాశముంది. షాపింగ్‌తో అలసిపోతే సేదదీరేందుకు, ఎక్కువ మంది విజిటర్స్‌ను ఆకర్షించేందుకు ఈ కాంక్రీట్ బీచ్ ఎంతో ఉపయోగపడుతున్నట్లు సమాచారం. చెంగ్డూ ప్రభుత్వం దాదాపు 600 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన గ్లోబల్ సెంటర్లోని కార్యాలయాల్లో పనిచేసేందుకు రోజూ 8000 మంది వచ్చిపోతున్నారు. రెండేళ్ల క్రితం ఈ సూపర్‌మాల్ ప్రారంభమైనప్పుడు డబ్బు దండగ వ్యవహారమని కొందరు విమర్శించినప్పటికీ 90 శాతం స్పేస్ అమ్ముడుపోయి ఇప్పుడు సూపర్‌హిట్ అనిపించుకుంటోంది.