new champion
-
Max Verstappen: ఎఫ్1లో సంచలనం.. తొలిసారి చాంపియన్‌గా..
Max Verstappen wins Abu Dhabi Grand Prix, beats Lewis Hamilton: గత నాలుగు సీజన్లలో ఎదురులేని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఆధిపత్యానికి గండికొడుతూ ఫార్ములావన్ (ఎఫ్1)లో మాక్స్ వెర్స్టాపెన్ రూపంలో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ ఆఖరి ల్యాప్‌లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు. దాంతో ఏడు ప్రపంచ టైటిల్స్ తో జర్మనీ దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన హామిల్టన్ మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. అబుదాబి: ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నిరూపించాడు. బ్లాక్ బాస్టర్ సినిమాను తలపించిన 2021 ఎఫ్1 సీజన్ వివాదాస్పదంగా ముగిసింది. డ్రైవర్ చాంపియన్‌షిప్‌ను తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్స్టాపెన్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన హామిల్టన్ (బ్రిటన్) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. హామిల్టన్ కొంపముంచిన సేఫ్టీ కార్... రెండో స్థానం నుంచి రేసును మొదలు పెట్టిన హామిల్టన్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి రేసులో ఆధిక్యంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి అద్భుతంగా డ్రైవ్ చేసిన హామిల్టన్ వెర్‌స్టాపెన్‌కు అందకుండా దూసుకెళ్లాడు. ల్యాప్ ల్యాప్నకు రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్తో అంతరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఇక ఎనిమిదో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం అనుకున్న తరుణంలో ‘సేఫ్టీ కార్’ ట్విస్ట్ హామిల్టన్ ఆశలపై నీళ్లు చల్లింది. 53వ ల్యాప్‌లో విలియమ్స్ డ్రైవర్ నికోలస్ లతీఫీ కారు ప్రమాదానికి గురికావడంతో రేసు స్టీవర్డ్స్ సేఫ్టీ కారును ట్రాక్ మీదకు పంపారు. ఇదే సమయంలో పిట్లోకి వచ్చిన వెర్స్టాపెన్ టైర్లను మార్చుకొని మళ్లీ ట్రాక్‌పై హామిల్టన్ వెనకగా రెండో స్థానంలో నిలిచాడు. 53వ ల్యాప్ ముందు వరకు హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య 11 ఉన్న సెకన్ల గ్యాప్ .... 57వ ల్యాప్‌లో సెకను కంటే తక్కువకు తగ్గింది. చివరి ల్యాప్‌లో రేసు మరోసారి ఆరంభం కాగా... రెండో స్థానంలో ఉన్న వెర్స్టాపెన్ తన కారుకు ఉన్న కొత్త టైర్ల సాయంతో ఐదో మలుపు వద్ద హామిల్టన్‌ను అధిగమించి విజేతగా నిలవడంతో పాటు డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ నిరసన... రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్స్టాపెన్ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్‌కు మెర్సిడెస్ ఫిర్యాదు కూడా చేసింది. 53వ ల్యాప్‌లో సేఫ్టీ కారు ట్రాక్‌పైకి రాగా... ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. తొలుత ల్యాప్డ్ (ఒక ల్యాప్ తక్కువగా పూర్తి చేసిన కార్లు) కార్లు అన్‌ల్యాప్ కాకూడదంటూ ఆదేశాలు జారీ చేసి... అనంతరం అన్‌ల్యాప్ చేయొచ్చుంటూ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దాంతో హామిల్టన్, వెర్స్టాపెన్ మధ్య ఉన్న ఐదు ల్యాప్డ్ కార్లు హామిల్టన్‌ను దాటుకుంటూ వెళ్లాయి. అదే సమయంలో సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లి రేసును మళ్లీ ఆరంభించాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది. ఇక్కడే వివాదం మొదలైంది. సేఫ్టీ కారు వచ్చే సమయానికి మొత్తం ఎనిమిది ల్యాప్డ్ కార్లు ట్రాక్‌పై ఉన్నాయి. కేవలం ఐదు కార్లకు మాత్రమే అన్‌ల్యాప్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించి మిగిలిన మూడు కార్లకు ఎందుకు కల్పించలేదంటూ మెర్సిడెస్ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్ కార్లు అన్‌ల్యాప్ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్‌ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్ పిట్లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్ ఫిర్యాదును స్టీవర్డ్స్ తోసిపుచ్చి వెర్స్టాపెన్ను విజేతగా ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి... ఎఫ్1 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెర్సిడెస్ జట్టు వరుసగా ఎనిమిదో ఏడాది విజేతగా నిలిచింది. ఈ సీజన్లో మొత్తం 9 రేసుల్లో గెలిచిన మెర్సిడెస్ 613.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఎఫ్1కు కిమీ రైకొనెన్ గుడ్‌బై అబుదాబి గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్‌కు ఫిన్లాండ్ డ్రైవర్ కిమీ రైకొనెన్ గుడ్‌బై చెప్పాడు. 2001లో సాబర్ జట్టు ద్వారా ఎఫ్1లో అరంగేట్రం చేసిన 41 ఏళ్ల రైకొనెన్... మెక్లారెన్, ఫెరారీ, లోటస్, ఆల్ఫా రొమెయో జట్ల తరఫున రేసింగ్‌లో పాల్గొన్నాడు. ఫెరారీ డ్రైవర్‌గా 2007లో డ్రైవర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గాడు. ఈ సీజన్లో వెర్స్టాపెన్ గెలిచిన రేసుల సంఖ్య. మొత్తం 22 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో నెగ్గాడు. పెరెజ్ (రెడ్‌బుల్), ఒకాన్ (అల్పైన్ రెనౌ), రికియార్డో (మెక్లారెన్), బొటాస్ (మెర్సిడెస్) ఒక్కో రేసులో గెలిచారు. The journey to the top of the world for @Max33Verstappen 🏆#AbuDhabiGP 🇦🇪 #F1 pic.twitter.com/rHHH4H0oUj — Formula 1 (@F1) December 12, 2021 -
చాంపియన్ ట్రయల్ బ్లేజర్స్
షార్జా: మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్లో కొత్త చాంపియన్ అవతరించింది. ఇప్పటికే రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకున్న డిఫెండింగ్ చాంపియన్ సూపర్ నోవాస్‌ను ఓడించి ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్ 16 పరుగులతో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్ నోవాస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 68; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టు ఆమాత్రం స్కోరు సాధించగలిగింది. నోవాస్ బౌలర్ రాధా యాదవ్ మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది. అనంతరం సల్మా ఖాతూన్ (3/18), దీప్తి శర్మ (2/9)ల ధాటికి సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ హర్మ¯న్‌ప్రీత్ కౌర్ (36 బంతుల్లో 30; 2 ఫోర్లు), శశికళ సిరివర్ధనే (18 బంతుల్లో 19; 1 ఫోర్) రాణించారు. విజేతగా నిలిచిన ట్రయల్ బ్లేజర్స్ జట్టుకు ట్రోఫీతోపాటు రూ. 25 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. కెప్టెన్ మెరుపులు... టైటిల్‌పై గురిపెట్టిన స్మృతి దూకుడే మంత్రంగా చెలరేగింది. అనుజా బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో తన ఉద్దేశాన్ని చాటింది. డాటిన్ (32 బంతుల్లో 20; 1 ఫోర్) రాణించడంతో పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు సాధించింది. తర్వాత నోవాస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పరుగుల వేగం తగ్గింది. డాటిన్‌ను అవుట్ చేసిన పూనమ్ యాదవ్ ఓవర్లోనే వరుసగా 4, 6తో స్మృతి జోరు పెంచింది. ఈ క్రమంలో 38 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుది. జట్టు స్కోరు 101 వద్ద స్మృతి రెండో వికెట్‌గా వెనుదిరిగింది. రాధ మాయాజాలం... డెత్ ఓవర్లలో రాధ కొట్టిన దెబ్బకి బ్లేజర్స్ ఇన్నింగ్స్ కకావిలకమైంది. 18వ ఓవర్లో బంతినందుకున్న ఆమె... దీప్తి శర్మ (9), రిచా ఘోష్ (10)లను డగౌట్ చేర్చి భారీ స్కోరుకు కళ్లెం వేసింది. ఇక చివరి ఓవర్లోనైతే ఏకంగా 3 వికెట్లతో విజృంభించింది. తొలి బంతికి ఎకెల్‌స్టోన్ (1), నాలుగో బంతికి హర్లీన్ (4), ఐదో బంతికి జులన్ గోస్వామి (1) వికెట్లను పడగొట్టి కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చింది. చివరి బంతికి చాంథమ్ (0) రనౌట్‌గా వెనుదిరగడంతో ఆ వికెట్ ఆమె ఖాతాలో చేరలేదు. ఈ దెబ్బకి చివరి ఐదు ఓవర్లలో నోవాస్ కేవలం 17 పరుగులే చేయగలిగింది. అతి జాగ్రత్తతో... ఆరంభంలోనే నోవాస్‌కు షాక్ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న చమరి ఆటపట్టు (6) వికెట్‌ను రివ్యూ కోరి బ్లేజర్స్ దక్కించుకుంది. దీంతో అతి జాగ్రత్తకు పోయిన నోవాస్ పవర్‌ప్లేలో 28 పరుగులే చేసింది. తానియా (14), జెమీమా (13) విఫలమయ్యారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడింది. శశికళ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించి మ్యాచ్‌పై ఆశలు రేపింది. విజయానికి 12 బంతుల్లో28 పరుగులు చేయాల్సి ఉండగా... రెండు పరుగుల వ్యవధిలో అనుజా, హర్మన్, పూజలను పెవిలియన్ చేర్చి సల్మా ఖాతూన్ నోవాస్ నుంచి టైటిల్‌ను లాగేసుకుంది. -
కప్పు కొట్లాటలో...
44 ఏళ్ల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఐదు జట్లే (వెస్టిండీస్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటివరకు చాంపియన్లుగా నిలిచాయి. పెద్ద టోర్నీల్లో తేలిపోయే దురదృష్ట దక్షిణాఫ్రికాను మినహాయిస్తే మిగతా వాటిలో కచ్చితంగా జగజ్జేతగా నిలిచే సత్తా ఉన్నవి ఇంగ్లండ్, న్యూజిలాండ్. అయితే, వీటి పోరాటం ఇన్నాళ్లూ సెమీఫైనల్లోనో, ఫైనల్లోనో ముగిసింది. ఇక ఆ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. కొత్త చాంపియన్ ఆవిర్భావానికి వేదిక సిద్ధమవుతోంది. సరికొత్త చరిత్ర నమోదుకు కాలం వేచి చూస్తోంది. మరి ఈ జట్ల గత ఫైనల్ ప్రస్థానం ఎలా ఉందంటే? సాక్షి క్రీడా విభాగం ఇంగ్లండ్ మూడుసార్లు 1979, 1987, 1992లో న్యూజిలాండ్ 2015లో ప్రపంచ కప్ చివరి మెట్టు వరకు వచ్చాయి. ఇంగ్లిష్ జట్టు... వరుసగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలై విశ్వ విజేతగా నిలిచే అవకాశం చేజార్చుకుంది. కివీస్‌ను గత కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండటం ఇదే మొదటిసారి కావడం ఓ విశేషమైతే... 12వ ప్రపంచ కప్ ద్వారా 23 ఏళ్ల తర్వాత కొత్త చాంపియన్‌ను ప్రేక్షకులు చూడబోతుండటం మరో విశేషం. చివరి సారిగా 1996లో (శ్రీలంక) ఓ కొత్త జట్టు జగజ్జేత అయింది. ఇంగ్లండ్ ఆ మూడుసార్లు ఇలా... క్రికెట్ పుట్టిల్లయిన ఇంగ్లండ్ ఇంతవరకు వన్డేల్లో విశ్వవిజేత కాలేకపోవడం ఆశ్చర్యమే. మంచి ఫామ్, గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ కొన్ని తప్పిదాల కారణంగా ఆ జట్టు మిగతా దేశాలతో పోటీలో వెనుకబడిపోయింది. వీటిలో సంప్రదాయ టెస్టు తరహా ఆటను విడనాడకపోవడం మొదటిది. కాలానికి తగ్గట్లు మారకపోవడం రెండోది. ఇప్పుడు వాటిని ఛేదించి అమీతుమీకి సిద్ధమైంది. గతంలోని మూడు విఫలయత్నాలను గమనిస్తే... వివ్ విధ్వంసంలో కొట్టుకుపోయింది... వరుసగా రెండోసారి ఆతిథ్యమిచ్చిన 1979 కప్‌లో ఇంగ్లండ్ గ్రూప్ మ్యాచ్‌లన్నిటిలో అజేయంగా నిలిచింది. కెప్టెన్ మైక్ బ్రియర్లీ, బాయ్‌కాట్ వంటి ఓపెనర్లతో, కుర్రాళ్లు గూచ్, బోథమ్, డేవిడ్ గోవర్లతో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించింది. సెమీస్‌లో గట్టి పోటీని తట్టుకుని 9 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. తుది సమరంలో మాత్రం భీకర వెస్టిండీస్‌కు తలొంచింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఓ తప్పిదం కాగా... విధ్వంసక వివ్ రిచర్డ్స్ (157 బంతుల్లో 138 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆతిథ్య జట్టును చితక్కొట్టాడు. కొలిస్ కింగ్ (66 బంతుల్లో 86; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అతడికి అండగా నిలవడంతో కరీబియన్లు నిర్ణీత 60 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. ఛేదనలో బ్రియర్లీ (64), బాయ్‌కాట్ (57) అర్ధ సెంచరీలతో మంచి పునాది వేసినా జోయల్ గార్నర్ (5/38) ధాటికి గూచ్ (32) మినహా మిగతావారు విఫలమయ్యారు. వీరు కాక రాండల్ (15) మాత్రమే రెండంకెల స్కోరు చేయడంతో ఇంగ్లండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. 92 పరుగుల తేడాతో ఓడి కప్‌ను చేజార్చుకుంది. గాటింగ్ షాట్‌తో గూబ గుయ్... భారత్ ఆతిథ్యమిచ్చిన 1987 కప్‌లో గ్రూప్ దశలో రెండుసార్లు (ఫార్మాట్ ప్రకారం) పాకిస్తాన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్... శ్రీలంక, వెస్టిండీస్‌లపై అజేయ విజయాలతో సెమీస్ చేరింది. సెమీస్‌లో నాటి డిఫెండింగ్ చాంపియన్ భారత్‌పై 35 పరుగులతో నెగ్గింది. ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను 50 ఓవర్లలో 253/5 కు కట్టడి చేసింది. గూచ్ (35), అథె (58)కు తోడు కెప్టెన్ గాటింగ్ (41), అలెన్ లాంబ్ (45) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. అయితే, 135/2తో ఉన్న దశలో గాటింగ్ అత్యుత్సాహ రివర్స్ స్వీప్ సీన్‌ను రివర్స్ చేసింది. స్కోరు 177 వద్ద అథెను ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు పట్టుబిగించి ఇంగ్లండ్‌ను 50 ఓవర్లలో 246/8కే పరిమితం చేశారు. కప్‌నకు అతి దగ్గరగా వచ్చిన ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో కోల్పోయింది. పాక్ ప్రతాపాన్ని తట్టుకోలేక... ఆ వెంటనే జరిగిన 1992 కప్‌లో రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఇంగ్లండ్ అదరగొట్టింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. వర్షం రూపంలో అదృష్టం కలిసివచ్చి సెమీస్‌లో దక్షిణాఫ్రికాను 19 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు వెళ్లింది. అటువైపు ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో ఇంగ్లండ్‌దే కప్ అని అంతా అనుకున్నారు. కానీ, పాక్ పట్టువిడవకుండా ఆడి ఇంగ్లండ్ కలను చెదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (72), జావెద్ మియాందాద్ (58) అర్ధసెంచరీలు, ఇంజమామ్ (42) అక్రమ్ (32) మెరుపులతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఛేదనలో అక్రమ్ (3/49), ముస్తాక్ అహ్మద్ (3/41), అకిబ్ జావెద్ (2/27) ప్రతాపానికి నీల్ ఫెయిర్ బ్రదర్ (62) తప్ప మిగతా ఇంగ్లండ్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో 49.2 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌటై కప్‌నకు 22 పరుగుల దూరంలో ఆగిపోయింది. కివీస్‌కు ఆసీస్ కిక్... ప్రపంచ కప్‌లలో న్యూజిలాండ్‌ది స్థిరమైన ప్రదర్శన. టోర్నీ ఎక్కడ జరిగినా కనీసం సెమీస్ చేరే స్థాయి ఉన్న జట్టుగా బరిలో దిగుతుంది. మొత్తం 12 కప్‌లలో 8 సార్లు సెమీస్‌కు రావడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి మార్టిన్ క్రో బ్యాటింగ్ మెరుపులతో సహ ఆతిథ్యమిచ్చిన 1992 కప్‌లోనే కివీస్ హాట్ ఫేవరెట్‌గా కనిపించింది. కానీ, సెమీస్‌లో పాకిస్తాన్ విజృంభణకు తలొంచింది. మళ్లీ 2015లో సహ ఆతిథ్యంలో కెప్టెన్ మెకల్లమ్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో మెగా టోర్నీలో విజేతగా నిలిచేలా కనిపించింది. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాను నిలువరించలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా... భీకర ఫామ్‌లో ఉన్న మెకల్లమ్ (0) డకౌట్ కావడంతో మానసికంగా బలహీన పడిపోయింది. ఇలియట్ (83), రాస్ టేలర్ (40) మాత్రమే రాణించడంతో 45 ఓవర్లలో 183కే ఆలౌటైంది. స్వల్ప స్కోరును ఆస్ట్రేలియా 33.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. -
అనిసిమోవా సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్–2007 ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 1990లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్ విలియమ్స్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహనా కొంటా (బ్రిటన్) తలపడతారు. సెమీస్‌లో జొకోవిచ్, థీమ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); జొకోవిచ్‌తో థీమ్ ఆడతారు. -
కొత్త చాంపియన్ వచ్చేనా?
ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది సీజన్లలో చాలా జట్లు అంచనాలకు మించి రాణించి చాంపియన్లుగా నిలిచాయి. విజేతలుగా అయ్యేందుకు అర్హతలు, స్టార్ ప్లేయర్లు ఉన్న కొన్ని జట్లు ఈసారి చాంపియన్లుగా నిలవాలని ఆశిస్తున్నాయి. అలాంటి జట్లు గురించి ఈరోజు తెలుసుకుందాం.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ ప్రారంభ సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెమీఫైనల్స్ వరకు చేరింది. ఆ తర్వాత మాత్రం ఈ జట్టు పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. వరుసగా ఐదు సీజన్లలో లీగ్ దశ లోనే వెనక్కి మళ్లినా 2014లో మా త్రం ఎవరూ ఊహించని రీతిలో చెలరేగి ఏకంగా ఫైనల్‌కు దూసుకువచ్చింది. కొత్తగా జట్టులోకి చేరిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ఉర్రూతలూగించాడు. చివరి రెండు సీజన్లలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చి అట్టడుగున ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి జట్టులో స్వల్ప మార్పులతో పాటు మెంటార్ సెహ్వాగ్, కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఆధ్వర్యంలో టైటిల్‌పై కన్నేసింది. అయితే ఓపెనర్ మురళీ విజయ్ లీగ్‌కు దూరం కావడం జట్టుకు ఇబ్బందే. విదేశీ ఆటగాళ్లే బలం మ్యాచ్ విన్నర్లను కలిగి ఉండడం ఈ జట్టు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. మ్యాక్స్‌వెల్, మిల్లర్‌కు తోడు ఈ ఏడాది జరిగిన వేలంలో కొనుగోలు చేసుకున్న ఇయాన్ మోర్గాన్, డారెన్ సామీ, మార్టిన్ గప్టిల్.. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగల సమర్థులే. షాన్ మార్ష, స్టోయినిస్, వోహ్రా, గుర్కీరత్, అక్షర్ పటేల్, కీపర్ వృద్ధిమాన్ సాహా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లే. తమిళనాడు ప్రీమియర్ లీగ్, రంజీల్లో ప్రతిభ చూపిన పేసర్ నటరాజన్‌ను కూడా తొలిసారి లీగ్‌లో ఆడనున్నాడు. 'స్వదేశీ' బలహీనత విదేశీ స్టార్ల బలగం ఎంత ఉన్నా తుది జట్టులో ఉండేది నలుగురే.. అయితే బౌలింగ్ విభాగంలో స్వదేశీ ఆటగాళ్లు కాస్త బలహీనంగా కనిపిస్తున్నారు. రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసుకున్న వరుణ్ ఆరోన్ ఆస్థాయిలో జట్టుకు ఉపయోగపడతాడా అనేది అనుమానమే. పేస్ విభాగంలో మోహిత్ శర్మ, సందీప్ శర్మలపై ఆధారపడి ఉంది. అనురీత్ సింగ్, స్టొయినిస్ బ్యాకప్‌గా ఉండనున్నారు. స్పిన్నర్ కరియప్ప గత సీజన్లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో ఈ విభాగంలో అక్షర్ పటేల్ కీలకం కానున్నాడు. ఉత్తమ ప్రదర్శన 2014లో ఫైనల్‌కు చేరిన పంజాబ్ రన్నరప్‌గా నిలిచింది. కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో పరాజయం పాలైంది. 2008లో సెమీస్‌కు చేరింది. ఈసారి పరిస్థితి పేపర్‌పై పటిష్టంగా కనిపిస్తున్న స్టార్ క్రికెటర్లు మైదానంలో ఏమేరకు రాణిస్తారనేది కీలకం. స్వదేశీ ఆటగాళ్ల ప్రతిభ తోడైతేనే లీగ్ దశ దాటే అవకాశం ఉంటుంది. జట్టు స్వదేశీ ఆటగాళ్లు: వృద్ధిమాన్ సాహా, గుర్కీరత్ సింగ్, మనన్ వోహ్రా, అక్షర్ పటేల్, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, నటరాజన్, అనురీత్ సింగ్, పర్దీప్ సాహు, స్వప్నిల్ సింగ్, నిఖిల్ నాయక్, కరియప్ప, అర్మాన్ జాఫర్, రాహుల్ తెవాటియా, రింకూ సింగ్. విదేశీ ఆటగాళ్లు: మ్యాక్స్‌వెల్ (కెప్టెన్), మిల్లర్, ఆమ్లా, సామీ, గప్టిల్, హెన్రీ, మోర్గాన్, స్టొయినిస్, షాన్ మార్షన్. గుజరాత్ లయన్స్ గతేడాది తమ అరంగేట్ర సీజన్లోనే ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్ లయన్స్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. రైనా కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్లి లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే కీలక ప్లే ఆఫ్‌లో నిరాశపరిచి వెనుదిరిగింది. ఈసారి నిలకడను కోల్పోకుండా తొలి టైటిల్‌ను దక్కించుకునేందుకు ఎదురుచూస్తోంది. ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్రాంతి కారణంగా, గాయంతో డ్వేన్ బ్రేవో ఆడలేకపోతున్నారు. సూపర్ హిట్టర్లు మెకల్లమ్, ఫించ్, రాయ్, రైనా, డ్వేన్ స్మిత్, దినేశ్ కార్తీక్‌లతో కూడిన లైనప్ జట్టుకు బలంగా ఉంది. వీరి అద్భుత ఇన్నింగ్స్‌తోనే క్రితంసారి చేజింగ్‌లో 80 శాతం విజయాలను సాధించింది. ఈసారి కూడా అదే ఫీట్‌ను పునరావృతం చేయాలని చూస్తోంది. బౌలింగ్ లోపం జట్టులో ఓ అద్భుత బౌలర్ అని చెప్పుకోవడానికి పేరున్న ఆటగాడు లేకపోవడం లోటుగా ఉంది. ప్రవీణ్ కుమార్, ధవల్ కులకర్ణి, శివిల్ కౌశిక్ గత సీజన్లో ఫర్వాలేదనిపించారు. ఈసారి వేలంలో మునాఫ్, నాథూ సింగ్, బసిల్ థంపీలను తీసుకున్నా వీరు ఏమాత్రం ఉపయోగపడతారో తెలీదు. అలాగే రైనాకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఇబ్బందికరమే. ఉత్తమ ప్రదర్శన 2016లో ప్లే ఆఫ్‌లో ఓడి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి పరిస్థితి : తమ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో ఆడితే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది. జట్టు స్వదేశీ ఆటగాళ్లు: రైనా (కెప్టెన్), రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, ధవల్ కులకర్ణి, ప్రవీణ్, ఇషాన్ కిషన్, మునాఫ్ పటేల్, ఆకాశ్‌దీప్, జయదేవ్ షా, షాదాబ్ జకాటి, ప్రదీప్ సాంగ్వాన్, కౌశిక్, నాథూ సింగ్, బాసిల్ థంపీ, బరోకా, మన్‌ప్రీత్ గోని, ప్రథమ్ సింగ్, శుభమ్ అగర్వాల్, శౌర్య. విదేశీ ఆటగాళ్లు: మెకల్లమ్, ఫించ్, బ్రేవో, ఫాల్క్‌నర్, స్మిత్, రాయ్, టై. రైజింగ్ పుణే సూపర్ జెయింట్.. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి పేరుంది. తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరుసార్లు ఫైనల్స్‌కు చేర్చడంతో పాటు వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే గతేడాది కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ పగ్గాలు చేపట్టిన అతను అందరి అంచనాలను వమ్ము చేస్తూ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. దీంతో జట్టు యాజమాన్యం ధోనిపై వేటు వేసి స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పచెప్పింది. జట్టును పటిష్టపరిచేందుకు ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఏకంగా రూ.14.5 కోట్లు పెట్టి ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)ను తీసుకుంది. గత సీజన్లో మిషెల్ మార్ష్, స్మిత్, డు ప్లెసిస్, పీటర్సన్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడం దెబ్బతీసింది. ఈసారి కూడా మార్ష్ ఆడకపోవంతో అతడి స్థానంలో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను తీసుకున్నారు. స్మిత్ ఫామ్ అండగా ఇటీవల భారత్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో భీకర ఫామ్‌తో కనిపించిన స్మిత్ జట్టుకు ప్రధాన ఆకర్షణ. దీంతో పాటు అజింక్యా రహానే, స్టోక్స్, ధోనిలతో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. డు ప్లెసిస్ ఆరంభ మ్యాచ్‌లు ఆడేది అనుమానమే.. చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టడం ఈ జట్టుకు అదనపు బలం. ఫీల్డింగ్‌లోనూ మెరుపు కదలికలతో ప్రత్యర్థి పరుగులను నియంత్రించగలదు. పరుగులను కట్టడి చేయాలి చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో గత సీజన్లో ఈ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ లోపాన్ని సరిచేసుకోవాల్సి ఉంది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ గాయంతో దూరం కావడం గట్టి షాకే. ఇక లోయర్ ఆర్డర్ నుంచి పరుగులు రాలేకపోతున్నాయి. ఇంగ్లండ్ తరఫున ఆడాల్సి ఉండడంతో లీగ్ మధ్యలో వెళ్లిపోయే స్టోక్స్‌పై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఉంది. ఈసారి పరిస్థితి: ప్లే ఆఫ్‌లో చోటే లక్ష్యంగా ఆడనుంది. జట్టు స్వదేశీ ఆటగాళ్లు: ధోని, రహానే, మనోజ్ తివారి, రజత్ భాటియా, అశోక్ దిండా, జయదేవ్ ఉనాద్కట్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, అపరాజిత్, అంకిత్ శర్మ, త్రిపాఠి, అంకుష్, చాహర్, ఈశ్వర్ పాండే, జస్కరణ్ సింగ్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, టాండన్. విదేశీ ఆటగాళ్లు: స్మిత్ (కెప్టెన్), స్టోక్స్, డు ప్లెసిస్, ఖాజా, మిషెల్ మార్షా, క్రిస్టియాన్, జంపా, ఫెర్గూసన్, తాహిర్.