కొత్త చాంపియన్ వచ్చేనా?
కొత్త చాంపియన్ వచ్చేనా?
Published Mon, Apr 3 2017 10:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది సీజన్లలో చాలా జట్లు అంచనాలకు మించి రాణించి చాంపియన్లుగా నిలిచాయి. విజేతలుగా అయ్యేందుకు అర్హతలు, స్టార్ ప్లేయర్లు ఉన్న కొన్ని జట్లు ఈసారి చాంపియన్లుగా నిలవాలని ఆశిస్తున్నాయి. అలాంటి జట్లు గురించి ఈరోజు తెలుసుకుందాం..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్
ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెమీఫైనల్స్ వరకు చేరింది. ఆ తర్వాత మాత్రం ఈ జట్టు పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. వరుసగా ఐదు సీజన్లలో లీగ్ దశ లోనే వెనక్కి మళ్లినా 2014లో మా త్రం ఎవరూ ఊహించని రీతిలో చెలరేగి ఏకంగా ఫైనల్‌కు దూసుకువచ్చింది. కొత్తగా జట్టులోకి చేరిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌లతో ఉర్రూతలూగించాడు. చివరి రెండు సీజన్లలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చి అట్టడుగున ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈసారి జట్టులో స్వల్ప మార్పులతో పాటు మెంటార్ సెహ్వాగ్, కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఆధ్వర్యంలో టైటిల్‌పై కన్నేసింది. అయితే ఓపెనర్ మురళీ విజయ్ లీగ్‌కు దూరం కావడం జట్టుకు ఇబ్బందే.
విదేశీ ఆటగాళ్లే బలం
మ్యాచ్ విన్నర్లను కలిగి ఉండడం ఈ జట్టు ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. మ్యాక్స్‌వెల్, మిల్లర్‌కు తోడు ఈ ఏడాది జరిగిన వేలంలో కొనుగోలు చేసుకున్న ఇయాన్ మోర్గాన్, డారెన్ సామీ, మార్టిన్ గప్టిల్.. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమవైపు తిప్పుకోగల సమర్థులే. షాన్ మార్‌ష, స్టోయినిస్, వోహ్రా, గుర్‌కీరత్, అక్షర్ పటేల్, కీపర్ వృద్ధిమాన్ సాహా నైపుణ్యం కలిగిన ఆటగాళ్లే. తమిళనాడు ప్రీమియర్ లీగ్, రంజీల్లో ప్రతిభ చూపిన పేసర్ నటరాజన్‌ను కూడా తొలిసారి లీగ్‌లో ఆడనున్నాడు.
'స్వదేశీ' బలహీనత
విదేశీ స్టార్ల బలగం ఎంత ఉన్నా తుది జట్టులో ఉండేది నలుగురే.. అయితే బౌలింగ్ విభాగంలో స్వదేశీ ఆటగాళ్లు కాస్త బలహీనంగా కనిపిస్తున్నారు. రూ.2.8 కోట్లకు కొనుగోలు చేసుకున్న వరుణ్ ఆరోన్ ఆస్థాయిలో జట్టుకు ఉపయోగపడతాడా అనేది అనుమానమే. పేస్ విభాగంలో మోహిత్ శర్మ, సందీప్ శర్మలపై ఆధారపడి ఉంది. అనురీత్ సింగ్, స్టొయినిస్ బ్యాకప్‌గా ఉండనున్నారు. స్పిన్నర్ కరియప్ప గత సీజన్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో ఈ విభాగంలో అక్షర్ పటేల్ కీలకం కానున్నాడు.
ఉత్తమ ప్రదర్శన
2014లో ఫైనల్‌కు చేరిన పంజాబ్ రన్నరప్‌గా నిలిచింది. కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పరాజయం పాలైంది. 2008లో సెమీస్‌కు చేరింది.
ఈసారి పరిస్థితి
పేపర్‌పై పటిష్టంగా కనిపిస్తున్న స్టార్ క్రికెటర్లు మైదానంలో ఏమేరకు రాణిస్తారనేది కీలకం. స్వదేశీ ఆటగాళ్ల ప్రతిభ తోడైతేనే లీగ్ దశ దాటే అవకాశం ఉంటుంది.
జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: వృద్ధిమాన్ సాహా, గుర్‌కీరత్ సింగ్, మనన్ వోహ్రా, అక్షర్ పటేల్, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, నటరాజన్, అనురీత్ సింగ్, పర్‌దీప్ సాహు, స్వప్నిల్ సింగ్, నిఖిల్ నాయక్, కరియప్ప, అర్మాన్ జాఫర్, రాహుల్ తెవాటియా, రింకూ సింగ్.
విదేశీ ఆటగాళ్లు: మ్యాక్స్‌వెల్ (కెప్టెన్), మిల్లర్, ఆమ్లా, సామీ, గప్టిల్, హెన్రీ, మోర్గాన్, స్టొయినిస్, షాన్ మార్షన్.
గుజరాత్ లయన్స్
గతేడాది తమ అరంగేట్ర సీజన్‌లోనే ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్ లయన్స్ అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. రైనా కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్లి లీగ్ దశలో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే కీలక ప్లే ఆఫ్‌లో నిరాశపరిచి వెనుదిరిగింది. ఈసారి నిలకడను కోల్పోకుండా తొలి టైటిల్‌ను దక్కించుకునేందుకు ఎదురుచూస్తోంది. ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్రాంతి కారణంగా, గాయంతో డ్వేన్ బ్రేవో ఆడలేకపోతున్నారు.
సూపర్ హిట్టర్లు
మెకల్లమ్, ఫించ్, రాయ్, రైనా, డ్వేన్ స్మిత్, దినేశ్ కార్తీక్‌లతో కూడిన లైనప్ జట్టుకు బలంగా ఉంది. వీరి అద్భుత ఇన్నింగ్స్‌తోనే క్రితంసారి చేజింగ్‌లో 80 శాతం విజయాలను సాధించింది. ఈసారి కూడా అదే ఫీట్‌ను పునరావృతం చేయాలని చూస్తోంది.
బౌలింగ్ లోపం
జట్టులో ఓ అద్భుత బౌలర్ అని చెప్పుకోవడానికి పేరున్న ఆటగాడు లేకపోవడం లోటుగా ఉంది. ప్రవీణ్ కుమార్, ధవల్ కులకర్ణి, శివిల్ కౌశిక్ గత సీజన్‌లో ఫర్వాలేదనిపించారు. ఈసారి వేలంలో మునాఫ్, నాథూ సింగ్, బసిల్ థంపీలను తీసుకున్నా వీరు ఏమాత్రం ఉపయోగపడతారో తెలీదు. అలాగే రైనాకు మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా ఇబ్బందికరమే.
ఉత్తమ ప్రదర్శన
2016లో ప్లే ఆఫ్‌లో ఓడి మూడో స్థానంలో నిలిచింది.
ఈసారి పరిస్థితి : తమ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆశించిన స్థాయిలో ఆడితే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.
జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: రైనా (కెప్టెన్), రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, ధవల్ కులకర్ణి, ప్రవీణ్, ఇషాన్ కిషన్, మునాఫ్ పటేల్, ఆకాశ్‌దీప్, జయదేవ్ షా, షాదాబ్ జకాటి, ప్రదీప్ సాంగ్వాన్, కౌశిక్, నాథూ సింగ్, బాసిల్ థంపీ, బరోకా, మన్‌ప్రీత్ గోని, ప్రథమ్ సింగ్, శుభమ్ అగర్వాల్, శౌర్య.
విదేశీ ఆటగాళ్లు: మెకల్లమ్, ఫించ్, బ్రేవో, ఫాల్క్‌నర్, స్మిత్, రాయ్, టై.
రైజింగ్ పుణే సూపర్ జెయింట్..
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఎంఎస్ ధోనికి పేరుంది. తన పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరుసార్లు ఫైనల్స్‌కు చేర్చడంతో పాటు వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిపాడు. అయితే గతేడాది కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ పగ్గాలు చేపట్టిన అతను అందరి అంచనాలను వమ్ము చేస్తూ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. దీంతో జట్టు యాజమాన్యం ధోనిపై వేటు వేసి స్టీవ్ స్మిత్‌కు పగ్గాలు అప్పచెప్పింది. జట్టును పటిష్టపరిచేందుకు ఫిబ్రవరిలో జరిగిన వేలంలో ఏకంగా రూ.14.5 కోట్లు పెట్టి ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)ను తీసుకుంది. గత సీజన్‌లో మిషెల్ మార్ష్, స్మిత్, డు ప్లెసిస్, పీటర్సన్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడం దెబ్బతీసింది. ఈసారి కూడా మార్ష్ ఆడకపోవంతో అతడి స్థానంలో స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌ను తీసుకున్నారు.
స్మిత్ ఫామ్ అండగా
ఇటీవల భారత్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో భీకర ఫామ్‌తో కనిపించిన స్మిత్ జట్టుకు ప్రధాన ఆకర్షణ. దీంతో పాటు అజింక్యా రహానే, స్టోక్స్, ధోనిలతో బ్యాటింగ్ దుర్భేధ్యంగా ఉంది. డు ప్లెసిస్ ఆరంభ మ్యాచ్‌లు ఆడేది అనుమానమే.. చివరి ఓవర్లలో భారీగా పరుగులు రాబట్టడం ఈ జట్టుకు అదనపు బలం. ఫీల్డింగ్‌లోనూ మెరుపు కదలికలతో ప్రత్యర్థి పరుగులను నియంత్రించగలదు.
పరుగులను కట్టడి చేయాలి
చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇవ్వడంతో గత సీజన్‌లో ఈ జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈ లోపాన్ని సరిచేసుకోవాల్సి ఉంది. స్టార్ స్పిన్నర్ అశ్విన్ గాయంతో దూరం కావడం గట్టి షాకే. ఇక లోయర్ ఆర్డర్ నుంచి పరుగులు రాలేకపోతున్నాయి. ఇంగ్లండ్ తరఫున ఆడాల్సి ఉండడంతో లీగ్ మధ్యలో వెళ్లిపోయే స్టోక్స్‌పై ఎక్కువగా ఆధారపడలేని పరిస్థితి ఉంది.
ఈసారి పరిస్థితి: ప్లే ఆఫ్‌లో చోటే లక్ష్యంగా ఆడనుంది.
జట్టు
స్వదేశీ ఆటగాళ్లు: ధోని, రహానే, మనోజ్ తివారి, రజత్ భాటియా, అశోక్ దిండా, జయదేవ్ ఉనాద్కట్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, అపరాజిత్, అంకిత్ శర్మ, త్రిపాఠి, అంకుష్, చాహర్, ఈశ్వర్ పాండే, జస్కరణ్ సింగ్, సౌరభ్ కుమార్, రాహుల్ చాహర్, టాండన్.
విదేశీ ఆటగాళ్లు: స్మిత్ (కెప్టెన్), స్టోక్స్, డు ప్లెసిస్, ఖాజా, మిషెల్ మార్‌షా, క్రిస్టియాన్, జంపా, ఫెర్గూసన్, తాహిర్.
Advertisement