New dance
-
Methil Devika: నాట్య వెన్నెల
వెన్నెలకు పరిమితులు ఉండవు. ధనిక, పేద, దివ్యాంగులు అనే తేడాలుండవు. ‘నృత్యం కూడా వెన్నెలలాంటిదే. అది అందరి కోసం. అందరిదీ’ అంటున్న మెథిల్ దేవిక బధిరుల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన దేవిక డ్యాన్స్ రిసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. సైన్లాంగ్వేజ్ నేర్చుకుంది. హస్తముద్రలను, సైన్లాంగ్వేజ్తో మిళితం చేసి ‘క్రాస్వోవర్’ నృత్యానికి రూపకల్పన చేసింది. గత నెల తిరువనంతపురంలో దేవిక ఇచ్చిన శాస్త్రీయ నృత్యప్రదర్శనను ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న బధిరులు ఆనందంగా ఆస్వాదించారు. ఒకసారి నృత్యప్రదర్శన ఇవ్వడానికి గుజరాత్‌కు వెళ్లిన దేవిక అక్కడ బధిరుల బృందాన్ని చూసింది. నృత్యం చూడాలనే ఆసక్తి వారిలో ఉన్నా సంపూర్ణంగా ఆస్వాదించగలరా? నృత్యం ద్వారా చెప్పే కథను వారు అర్థం చేసుకోగలరా? వారికి సులభంగా అర్థం కావాలంటే ఏంచేయాలి... ఇలాంటి విషయాలు ఎన్నో ఆలోచించింది దేవిక. దేవిక సందేహించినట్లుగానే వారు తన నృత్యప్రదర్శనతో కనెక్ట్ కాలేదు. అర్థం కానట్లు ముఖం పెట్టారు. ఇక అప్పటి నుంచి ‘డ్యాన్స్ ఫిలాంత్రపి అండ్ సోషల్ ఇన్‌క్లూజన్’ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. డ్యాన్స్ వొకాబ్యులరీని అభివృద్ధి చేయడానికి ఎంతోమందితో మాట్లాడింది. ‘నృత్యకారులకు తమతో తాము సంభాషించుకునే, తమలో ఊహాలోకాన్ని ఆవిష్కరించుకునే ఏకాంతంలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నృత్యప్రదర్శనలు లేని ఖాళీ సమయంలో బధిరులను దృష్టిలో పెట్టుకొని మనసులోనే డ్యాన్స్‌ను కంపోజ్ చేశాను. ఊహల్లోని నృత్యానికి వాస్తవరూపం ఇవ్వడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’ అంటుంది దేవిక. కేరళలోని పాలక్కాడ్‌లో కళాకారుల కుటుంబంలో పుట్టింది దేవిక. నాలుగేళ్ల వయసులోనే కాలికి గజ్జె కట్టింది. 20 సంవత్సరాల వయసులో సోలోపెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కేరళ కళామండపం’లో విద్యార్థులకు నాట్యపాఠాలు బోధించింది. టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది. ‘నృత్యానికి పరిమితులు ఉన్నప్పుడు దాని ఉద్దేశం నెరవేరదు. అది సంపన్న కళాప్రియులకే కాదు అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన నృత్యప్రదర్శన సామాన్యులకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తోంది. తిరువనంతపురం డ్యాన్స్ షోలో బధిరులు తన హస్తముద్రలను అనుకరించడం దేవికకు సంతోషం ఇచ్చింది. ‘అదొక గొప్ప అనుభవం. వారి కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలకు చెందిన ప్రేక్షకుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఆ సంతోషాన్ని మించిన సంతోషం ఇది. నా నృత్యం వారి హృదయానికి దగ్గరైంది. నా ఉద్దేశం నెరవేరింది’ అంటోంది దేవిక. ‘నృత్యాన్ని ప్రజాస్వామీకరించాలి. అది అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటోంది. మనం ఒక ప్రయోగానికి సిద్ధపడినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దేవిక ఆలాగే చేసింది. ధైర్యంగా ముందు అడుగు వేసింది. బధిరులలో ఎంతోమందికి నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే ప్రతికూల ఆలోచనలు వారిని వెనక్కి లాగవచ్చు. అలాంటి వారిని నృత్యకారులుగా తయారుచేయడానికి దేవిక సృష్టించిన నృత్యశైలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. క్రాస్వోవర్ నృత్యప్రదర్శన చూస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన వెలుగు నాకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. మనం వెదకాలేగాని దారులు ఎన్నో ఉన్నాయి. ‘క్రాస్వోవర్’ ద్వారా నాకు ఒక కొత్త దారి దొరికింది. – మెథిల్ దేవిక -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
ఒళ్లంత.. తుళ్లింత
‘జుంబా’రే.. అంటూ ఆడుతూ పాడుతూ వ్యాయామం.. నీటి కొలనులో గిలిగింతల మధ్య కేరింతల విన్యాసాలు.. ఫిట్‌నెస్‌కు పెద్దపీట వేసే నగరవాసుల అభిరుచికి మరో కొత్త వేదిక దొరికింది. ఈత కొలనులంటేనే ఒక విధమైన ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇక అందులో నృత్యరీతుల్ని తలపించే విన్యాసాలతో కూడిన వ్యాయామమంటే ఆ సందడికి వెనుకాడేది ఎవరు?. సాధారణంగా వ్యాయామం అనగానే జిమ్‌లు, కొద్దిపాటి ఇండోర్ ఆడిటోరియంలు.. ఇవే కాదు ఇప్పుడు ఈతకొలనూ వ్యాయామ వేదికే. నగరంలో నడుస్తోన్న ఈ కొత్త ట్రెండ్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తోంది. నీటిలో కేరింతలు కొడుతూ తేలికపాటి కదలికలను ల యబద్ధంగా ప్రదర్శించటమే ‘ఆక్వా జుంబా’. సాధారణ దారుఢ్య కసరత్తులతో సమానంగా ఇదీ దేహానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్నిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాలామంది రిలాక్స్ కావటానికి ఈత కొలనులను ఆశ్రయిస్తుంటారు. ఆ సందర్భంలోనే వినూత్న విన్యాసాల ద్వారా శరీరంలోని అదనపు క్యాలరీలను ఆక్వా జుంబా ద్వారా ఖర్చు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొత్త క్రేజ్.. ఆక్వా జుంబా నగర యువత డ్యాన్స్ అంటే కిర్రెక్కిపోతుంది. వీటిలో రకరకాలు.. వీటిని ప్రదర్శించే పలు స్టూడియోలు, వేదికలకు కొదవే లేదు. డ్యాన్స్‌ను ఒక ఫ్యాషన్‌గా ఎంచుకునేవారు లేదంటే నృత్యం ద్వారా ఒంట్లోని అదనపు కొవ్వును కరిగించుకునే వారు, శరీర సౌష్టవాన్ని తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవాలనుకొనే వారు మొదట ఆశ్రయించేది డ్యాన్స్రీతుల్నే. అందుకే వీటికంత క్రేజ్. ఈ కోవలో కొత్తగా ఆకర్షిస్తోంది ఆక్వా జుంబా. శరీర సౌష్టవాన్ని కాపాడుకోవటానికి చక్కని, తేలికపాటి వ్యాయామాన్ని నీటిలో ఉండి చేయటమే ఈ నృత్య శైలి అని జుంబా శిక్షకులు సాదిక్ చెప్పారు. ప్రస్తుతం ఇది ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని ఆయన చెబుతున్నారు. పబ్బులు, క్లబ్బుల్లో, రిసార్ట్స్‌లో కాలక్షేపం చేయాలనుకునే యువత ఇప్పుడు ఇలాంటి ఆక్వాజుంబాతో మరింత ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వారాంతాల్లో... గిలిగింతలు.. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈత కొలనులే ఇప్పుడు ఆక్వాజుంబాకు వేదికలు. వారాంతాల్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. నగరంలో విజయ తుపురాని ఆధ్వర్యంలో దీని తరగతులు కొనసాగుతున్నాయి. అపోలో లైఫ్ సెంటర్, ది పార్క్, తాజ్‌కృష్ణ, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్, చాలా మేర ఈతకొలనులు ఉన్న హోటళ్లతో పాటు విల్లాలు, ఇతర రిసార్ట్స్‌లలో ఇవి ఎక్కువగా కొనసాగుతున్నాయి. వారాంతాల్లో శిక్షణనిచ్చేందుకు ముంబై తదితర మెట్రో నగరాల నుంచి ప్రత్యేక శిక్షకులు వస్తున్నారు. ఆక్వా జుంబా ఒక వేడుకలా సాగుతోందని, రెగ్యులర్ వ్యాయామ శైలిలో లేదని బంజారాహిల్స్‌కు చెందిన శ్రీచందన తెలిపారు. వ్యాయామానికి కష్టపడినంతగా దీనికి చెమటోడ్చనవసరం లేదని, మనకు తెలియకుండానే శరీర బరువును తగ్గించుకోవచ్చునని ఆమె అతన అనుభవాన్ని వివరించారు. భారం తగ్గుతుంది.... సాధారణంగా జుంబాకి, ఆక్వా జుంబాకి చాలా తేడా ఉంటుందని ఇటీవలే ఈ నృత్యరీతిని ప్రారంభించిన శిరీష తెలిపారు. జుంబా గంటపాటు చేయడం వల్ల దాదాపు 300 నుంచి 500 కేలరీల వరకు కొవ్వు ఖర్చవుతుంది. అదే నీటిలో చేసే ఆక్వా జుంబాతో 500 నుంచి 800 కేలరీల వరకు కొవ్వు ఖర్చవుతుంది. సాధారణంగా బయట ఉండే వ్యక్తి చేతిని గాలిలో తిప్పితే తేలికగా తిరుగుతుంది. కానీ నీటిలో చేయిని కదిలించాలంటే కొద్ది బలం అవసరం. అపసవ్యదిశలో నీటిని కదిలించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుందని నృత్య శిక్షకుడు సాదిక్ తెలిపారు. నీటిలో నృత్యం చేయడం వల్ల ఒక్క అవయవానికే కాక శరీరంలోని ప్రతి భాగానికి వ్యాయామం చేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఆక్వా జుంబా ఉపశమనాన్ని ఇస్తుందని శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు. సౌష్టవానికి సైతం... ఆడుతూ పాడుతూ చేసే ఆక్వాజుంబాతో శరీర ఆకృతిని, సౌష్టవాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చని శిక్షకులు చెబుతున్నారు. నీటిలో ఉండి నృత్యాలు చేయడం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి కసరత్తు అందుతుంది. ప్రధానంగా చేతులు, కండలు, కాళ్లపిక్కలు.. ఇలా అన్నింటికి సరైన ఆకృతి వస్తుంది. ఇక పొట్ట తగ్గించుకోవడానికి ఈ నృత్యరీతి ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే రంగుకాస్త తగ్గే అవకాశం ఉందని, కాబట్టి సమయానుసారం ఆక్వా జుంజా ఆచరించాలని నిపుణులు సూచిస్తున్నారు.