వెన్నెలకు పరిమితులు ఉండవు. ధనిక, పేద, దివ్యాంగులు అనే తేడాలుండవు. ‘నృత్యం కూడా వెన్నెలలాంటిదే. అది అందరి కోసం. అందరిదీ’ అంటున్న మెథిల్ దేవిక బధిరుల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన దేవిక డ్యాన్స్ రిసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. సైన్‌లాంగ్వేజ్ నేర్చుకుంది. హస్తముద్రలను, సైన్‌లాంగ్వేజ్‌తో మిళితం చేసి ‘క్రాస్‌వోవర్’ నృత్యానికి రూపకల్పన చేసింది.
గత నెల తిరువనంతపురంలో దేవిక ఇచ్చిన శాస్త్రీయ నృత్యప్రదర్శనను ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న బధిరులు ఆనందంగా ఆస్వాదించారు. ఒకసారి నృత్యప్రదర్శన ఇవ్వడానికి గుజరాత్‌కు వెళ్లిన దేవిక అక్కడ బధిరుల బృందాన్ని చూసింది. నృత్యం చూడాలనే ఆసక్తి వారిలో ఉన్నా సంపూర్ణంగా ఆస్వాదించగలరా? నృత్యం ద్వారా చెప్పే కథను వారు అర్థం చేసుకోగలరా? వారికి సులభంగా అర్థం కావాలంటే ఏంచేయాలి... ఇలాంటి విషయాలు ఎన్నో ఆలోచించింది దేవిక.
దేవిక సందేహించినట్లుగానే వారు తన నృత్యప్రదర్శనతో కనెక్ట్ కాలేదు. అర్థం కానట్లు ముఖం పెట్టారు. ఇక అప్పటి నుంచి ‘డ్యాన్స్ ఫిలాంత్రపి అండ్ సోషల్ ఇన్‌క్లూజన్’ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. డ్యాన్స్ వొకాబ్యులరీని అభివృద్ధి చేయడానికి ఎంతోమందితో మాట్లాడింది. ‘నృత్యకారులకు తమతో తాము సంభాషించుకునే, తమలో ఊహాలోకాన్ని ఆవిష్కరించుకునే ఏకాంతంలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నృత్యప్రదర్శనలు లేని ఖాళీ సమయంలో బధిరులను దృష్టిలో పెట్టుకొని మనసులోనే డ్యాన్స్‌ను కంపోజ్ చేశాను. ఊహల్లోని నృత్యానికి వాస్తవరూపం ఇవ్వడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’ అంటుంది దేవిక.
కేరళలోని పాలక్కాడ్‌లో కళాకారుల కుటుంబంలో పుట్టింది దేవిక. నాలుగేళ్ల వయసులోనే కాలికి గజ్జె కట్టింది. 20 సంవత్సరాల వయసులో సోలోపెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కేరళ కళామండపం’లో విద్యార్థులకు నాట్యపాఠాలు బోధించింది. టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది.
‘నృత్యానికి పరిమితులు ఉన్నప్పుడు దాని ఉద్దేశం నెరవేరదు. అది సంపన్న కళాప్రియులకే కాదు అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన నృత్యప్రదర్శన సామాన్యులకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తోంది.
తిరువనంతపురం డ్యాన్స్ షోలో బధిరులు తన హస్తముద్రలను అనుకరించడం దేవికకు సంతోషం ఇచ్చింది. ‘అదొక గొప్ప అనుభవం. వారి కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలకు చెందిన ప్రేక్షకుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఆ సంతోషాన్ని మించిన సంతోషం ఇది. నా నృత్యం వారి హృదయానికి దగ్గరైంది. నా ఉద్దేశం నెరవేరింది’ అంటోంది దేవిక.
‘నృత్యాన్ని ప్రజాస్వామీకరించాలి. అది అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటోంది. మనం ఒక ప్రయోగానికి సిద్ధపడినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దేవిక ఆలాగే చేసింది. ధైర్యంగా ముందు అడుగు వేసింది. బధిరులలో ఎంతోమందికి నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే ప్రతికూల ఆలోచనలు వారిని వెనక్కి లాగవచ్చు. అలాంటి వారిని నృత్యకారులుగా తయారుచేయడానికి దేవిక సృష్టించిన నృత్యశైలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
క్రాస్‌వోవర్
నృత్యప్రదర్శన చూస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన వెలుగు నాకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి.
మనం వెదకాలేగాని దారులు ఎన్నో ఉన్నాయి. ‘క్రాస్‌వోవర్’ ద్వారా నాకు ఒక కొత్త దారి దొరికింది.
– మెథిల్ దేవిక
Comments
Please login to add a commentAdd a comment