ఒళ్లంత.. తుళ్లింత
‘జుంబా’రే.. అంటూ ఆడుతూ పాడుతూ వ్యాయామం.. నీటి కొలనులో గిలిగింతల మధ్య కేరింతల విన్యాసాలు.. ఫిట్‌నెస్‌కు పెద్దపీట వేసే నగరవాసుల అభిరుచికి మరో కొత్త వేదిక దొరికింది. ఈత కొలనులంటేనే ఒక విధమైన ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఇక అందులో నృత్యరీతుల్ని తలపించే విన్యాసాలతో కూడిన వ్యాయామమంటే ఆ సందడికి వెనుకాడేది ఎవరు?. సాధారణంగా వ్యాయామం అనగానే జిమ్‌లు, కొద్దిపాటి ఇండోర్ ఆడిటోరియంలు.. ఇవే కాదు ఇప్పుడు ఈతకొలనూ వ్యాయామ వేదికే. నగరంలో నడుస్తోన్న ఈ కొత్త ట్రెండ్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షిస్తోంది.
నీటిలో కేరింతలు కొడుతూ తేలికపాటి కదలికలను ల యబద్ధంగా ప్రదర్శించటమే ‘ఆక్వా జుంబా’. సాధారణ దారుఢ్య కసరత్తులతో సమానంగా ఇదీ దేహానికి అవసరమైన శక్తిని, ఉత్సాహాన్నిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాలామంది రిలాక్స్ కావటానికి ఈత కొలనులను ఆశ్రయిస్తుంటారు. ఆ సందర్భంలోనే వినూత్న విన్యాసాల ద్వారా శరీరంలోని అదనపు క్యాలరీలను ఆక్వా జుంబా ద్వారా ఖర్చు చేసుకోవచ్చని చెబుతున్నారు.
కొత్త క్రేజ్.. ఆక్వా జుంబా
నగర యువత డ్యాన్స్ అంటే కిర్రెక్కిపోతుంది. వీటిలో రకరకాలు.. వీటిని ప్రదర్శించే పలు స్టూడియోలు, వేదికలకు కొదవే లేదు. డ్యాన్స్‌ను ఒక ఫ్యాషన్‌గా ఎంచుకునేవారు లేదంటే నృత్యం ద్వారా ఒంట్లోని అదనపు కొవ్వును కరిగించుకునే వారు, శరీర సౌష్టవాన్ని తీరైన ఆకృతిలో తీర్చిదిద్దుకోవాలనుకొనే వారు మొదట ఆశ్రయించేది డ్యాన్స్‌రీతుల్నే. అందుకే వీటికంత క్రేజ్. ఈ కోవలో కొత్తగా ఆకర్షిస్తోంది ఆక్వా జుంబా. శరీర సౌష్టవాన్ని కాపాడుకోవటానికి చక్కని, తేలికపాటి వ్యాయామాన్ని నీటిలో ఉండి చేయటమే ఈ నృత్య శైలి అని జుంబా శిక్షకులు సాదిక్ చెప్పారు. ప్రస్తుతం ఇది ఎక్కువ మందిని ఆకర్షిస్తోందని ఆయన చెబుతున్నారు. పబ్బులు, క్లబ్బుల్లో, రిసార్ట్స్‌లో కాలక్షేపం చేయాలనుకునే యువత ఇప్పుడు ఇలాంటి ఆక్వాజుంబాతో మరింత ఎంజాయ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వారాంతాల్లో... గిలిగింతలు..
కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో ఈత కొలనులే ఇప్పుడు ఆక్వాజుంబాకు వేదికలు. వారాంతాల్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది. నగరంలో విజయ తుపురాని ఆధ్వర్యంలో దీని తరగతులు కొనసాగుతున్నాయి. అపోలో లైఫ్ సెంటర్, ది పార్క్, తాజ్‌కృష్ణ, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్, చాలా మేర ఈతకొలనులు ఉన్న హోటళ్లతో పాటు విల్లాలు, ఇతర రిసార్ట్స్‌లలో ఇవి ఎక్కువగా కొనసాగుతున్నాయి. వారాంతాల్లో శిక్షణనిచ్చేందుకు ముంబై తదితర మెట్రో నగరాల నుంచి ప్రత్యేక శిక్షకులు వస్తున్నారు. ఆక్వా జుంబా ఒక వేడుకలా సాగుతోందని, రెగ్యులర్ వ్యాయామ శైలిలో లేదని బంజారాహిల్స్‌కు చెందిన శ్రీచందన తెలిపారు. వ్యాయామానికి కష్టపడినంతగా దీనికి చెమటోడ్చనవసరం లేదని, మనకు తెలియకుండానే శరీర బరువును తగ్గించుకోవచ్చునని ఆమె అతన అనుభవాన్ని వివరించారు.
భారం తగ్గుతుంది....
సాధారణంగా జుంబాకి, ఆక్వా జుంబాకి చాలా తేడా ఉంటుందని ఇటీవలే ఈ నృత్యరీతిని ప్రారంభించిన శిరీష తెలిపారు. జుంబా గంటపాటు చేయడం వల్ల దాదాపు 300 నుంచి 500 కేలరీల వరకు కొవ్వు ఖర్చవుతుంది. అదే నీటిలో చేసే ఆక్వా జుంబాతో 500 నుంచి 800 కేలరీల వరకు కొవ్వు ఖర్చవుతుంది. సాధారణంగా బయట ఉండే వ్యక్తి చేతిని గాలిలో తిప్పితే తేలికగా తిరుగుతుంది. కానీ నీటిలో చేయిని కదిలించాలంటే కొద్ది బలం అవసరం. అపసవ్యదిశలో నీటిని కదిలించడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుందని నృత్య శిక్షకుడు సాదిక్ తెలిపారు. నీటిలో నృత్యం చేయడం వల్ల ఒక్క అవయవానికే కాక శరీరంలోని ప్రతి భాగానికి వ్యాయామం చేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. హృద్రోగ సమస్యలు, కీళ్ల నొప్పులు, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి ఆక్వా జుంబా ఉపశమనాన్ని ఇస్తుందని శిక్షణ పొందుతున్న వారు చెబుతున్నారు.
సౌష్టవానికి సైతం...
ఆడుతూ పాడుతూ చేసే ఆక్వాజుంబాతో శరీర ఆకృతిని, సౌష్టవాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవచ్చని శిక్షకులు చెబుతున్నారు. నీటిలో ఉండి నృత్యాలు చేయడం ద్వారా శరీరంలోని ప్రతి భాగానికి కసరత్తు అందుతుంది. ప్రధానంగా చేతులు, కండలు, కాళ్లపిక్కలు.. ఇలా అన్నింటికి సరైన ఆకృతి వస్తుంది. ఇక పొట్ట తగ్గించుకోవడానికి ఈ నృత్యరీతి ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు నీటిలో ఉంటే రంగుకాస్త తగ్గే అవకాశం ఉందని, కాబట్టి సమయానుసారం ఆక్వా జుంజా ఆచరించాలని నిపుణులు సూచిస్తున్నారు.