నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్
ఔరంగాబాద్: అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న శివభక్తులపైకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన బీహార్‌లోని ఔరంగబాద్ జిల్లాలోని న్యూఢిల్లీ - కోల్కత్తా 2వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఉపేంద్ర కుమార్ శర్మ వెల్లడించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
మృతుల్లో అయిదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. శివభక్తులంతా జార్ఖాండ్‌లోని దేవ్‌గఢ్ దేవాలయాన్ని సందర్శించుకుని వస్తున్నారని... ఆ క్రమంలో శివభక్తులంతా ప్రయాణ బడలికతో వారు ప్రయాణిస్తున్న బస్సును జాతీయ రహదారి పక్కన ఉంచి ... ఆ పక్కనే వారు నిద్రకు ఉపక్రమించారని ఎస్పీ వెల్లడించారు. అదే రహదారిపై అతివేగంతో వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పడంతో శివభక్తులపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.