కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
చింతకాని: టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై శాస్త్రీయతను పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల విభజన లో ప్రభుత్వం మొండివైఖరిగా వ్యవహరించటం వలన రాష్ట్రంలోని భవిష్యత్ తరాలు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా జిల్లాల ఏర్పాటు ఉండేందుకు పలు పార్టీల నిర్ణయాలు వెల్లడించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించవద్దని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ ఆ ప్రాంతాలను జిల్లాలుగా ప్రకటిస్తుందని తెలిపారు. అంతేకాక జనగామ చారిత్రాత్మక ప్రాంతమని, తెలంగాణలో పోరాటయోధులు చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఉద్యమం చేసిన జనగామను జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టిందన్నారు. తెలంగాణలో గిరిజనులకు ప్రత్యేకంగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు జోన్ల వ్యవస్థను రద్దు చేసి ఒకే జోన్ కిందకు తీసుకువస్తానన్న కేసీఆర్ మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయన్నారు. ప్రయోజనం లేని టీఆర్ఎస్ నిర్ణయాలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, సీసీఐ సీనియర్ నాయకులు టీవీ చౌదరి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు పోటు ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి శివరామకృష్ణ, జిల్లా నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, ఏపూరి రవీంద్రబాబు, మండల నాయకులు పావులూరి మల్లిఖార్జున్‌రావు, ఏసు తదితరులు పాల్గొన్నారు.