శరవేగంగా కొత్త జిల్లాల కార్యాచరణ
హుటాహుటిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ
జిల్లాలవారీగా రేపటి నుంచి 3 రోజులు సమావేశాలు
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఒక్కసారిగా వేగం పుంజుకుంది. ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం హుటాహుటిన రంగంలోకి దిగింది. బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అధ్యక్షతన మరో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యా రు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అభిప్రాయాలు, ప్రతిపాదనలను పరిశీ లించారు. అధికారులతో చర్చించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసేలోపు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. వరుసగా పది రోజుల పాటు సమావేశాలు, సమీక్షలు జరపాలని నిర్ణయిం చారు. వీటిలో వచ్చే అభిప్రాయాలు, నిర్ణయాల మేరకు జిల్లాల కసరత్తును కొలిక్కి తెస్తారు.
12 నుంచి సమావేశాలు: తాజా షెడ్యూలు ప్రకారం ఒక్కోరోజు మూడు నాలుగు చొప్పున శుక్రవారం నుంచి వరుసగా 3 రోజుల పాటు జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్; 13న కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం; 14న మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల ప్రజాప్రతి నిధులు, కలెక్టర్లతో సమావేశాలుంటాయి. ఆయా జిల్లాల మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు పాల్గొంటారు. జిల్లాకు 2 గంటల సమయం కేటాయించి చర్చించనున్నారు.
ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాలతో భేటీ
జోనల్ వ్యవస్థతో పాటు ఉద్యోగుల విభజన తదితరాలపై శుక్రవారం ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో ఉపసంఘం ప్రత్యేకంగా భేటీ కానుంది. తర్వాత ఈ నెల 18న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఉపసంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త జిల్లాలపై వారంలోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. సీఎం ఆదేశాల మేరకు బుధవారమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ సీఎస్ రాజీవ్‌శర్మ ఉత్తర్వులిచ్చారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర కన్వీనర్‌గా, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ కార్యదర్శిగా ఉంటారు. కొత్త జిల్లాల సంఖ్య, వాటి ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లు, ఆఫీసులు, ఉద్యోగుల విభజన, జోన్ల విధాన మార్గదర్శకాలు తదితరాలపై సిఫార్సులు చేయాలని కమిటీకి సూచించారు.
కమిటీ ఖరారు చేసిన తాజా షెడ్యూలు
ఆగస్టు 12: ఉద్యోగ సంఘాలతో కమిటీ ప్రత్యేక భేటీ
ఆగస్టు 12: ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు
ఆగస్టు 13: కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం
ఆగస్టు 14: మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్