ఓటేయలేకపోయిన మీరాకుమార్
ససారాం(బీహార్): సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఆమెకు ఢిల్లీలో ఓటు ఉంది. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీ చిరుమానాతో ఆమె పేరు ఓటర్ల జాబితాలో నమోదైంది.
అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా మీరాకుమార్ పోటీ చేస్తున్న బీహార్‌లోని ససారాం లోక్‌సభ నియోజకవర్గానికి గురువారమే పోలింగ్ జరిగింది. మరోవైపు ఢిల్లీలోనూ ఇదేరోజున పోలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ససారాంలో పోలింగ్ సరళిని పర్యవేక్షించడంలో ఆమె పూర్తిగా నిమగ్నమయ్యారు. తాను పోటీ చేస్తున్న ససారాంలో పోలింగ్‌ను పర్యవేక్షించడంలో పూర్తిగా బిజీగా ఉన్నందునే స్పీకర్ ఢిల్లీ వెళ్లలేకపోయారని ఇక్కడి ఆమె ఎన్నికల కార్యాలయ వర్గాలు వివరించాయి.