New Jersey State Court
-
విప్రోపై అమెరికాలో ‘క్లాస్ యాక్షన్’ దావా
వాషింగ్టన్: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం విప్రోపై అమెరికాలో అయిదుగురు ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేసింది. దక్షిణాసియా, భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యమిస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12% కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80% మంది ఉన్నారని (ప్రధానంగా భారతీయులు) ఉద్యోగుల బృందం పేర్కొంది. కోర్టులో వ్యాజ్యం ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించబోమని విప్రో తెలిపింది. -
మరోసారి చిక్కుల్లో విప్రో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మరోసారి చిక్కుల్లో పడింది. తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ అయిదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు. 2020 మార్చి 30 న న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి తేడాలు చూపిస్తోందన్నారు. దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు. గత పదేళ్లుగా విప్రోలో పని చేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి , మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో తిరస్కరించింది. కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో) చదవండి : జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
డాక్టర్ రెడ్డీస్‌పై కొరియా కంపెనీ దావా
♦ తయారీ మార్గదర్శకాల ఉల్లంఘన, మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ♦ న్యూజెర్సీ స్టేట్ కోర్టులో పిటిషన్ దాఖలు ♦ మిలియన్ల డాలర్ల జరిమానా రాబట్టాలని వినతి హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి భారతీయ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్‌కు మరో చిక్కు వచ్చి పడింది. డాక్టర్ రెడ్డీస్‌పై దక్షిణ కొరియాకు చెందిన బయోటెక్ కంపెనీ మెజియాన్ ఫార్మా కోర్టుకెక్కింది. ఉత్తమ తయారీ విధానం మార్గదర్శకాల (సీజీఎంపీ) విషయంలో పెద్ద ఎత్తున లోపాలను దాచిపెట్టి డాక్టర్ రెడ్డీస్ మోసానికి పాల్పడిందని ఆరోపిస్తూ అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. నిబంధనల అమలులో తప్పుదోవ పట్టించి, మోసపూరితంగా విషయాలను దాచిపెట్టిన డాక్టర్ రెడ్డీస్ నుంచి మిలియన్ డాలర్లను నష్టాల కింద వసూలు చేయాలని కోరింది. అంగస్తంభన లోపానికి సంబంధించి తమ నూతన ఔషధం ఉడెనాఫిల్ దరఖాస్తుకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరించడానికి కారణం డాక్టర్ రెడ్డీస్ తప్పుదోవ పట్టించడమేనని మెజియాన్ ఆరోపించింది. ఉడెనాఫిల్ మార్కెటింగ్‌కు అనుమతి నిరాకరించడం వల్ల కాలహరణంతోపాటు వ్యయాలకు దారితీసిందన్నది మెజియాన్ ఆరోపణ. దీనివల్ల ఉడెనాఫిల్ ఔషధానికి సంబంధించి కొత్తగా తయారీ, సరఫరాదారులను వెతుక్కోవాల్సిన పరిస్థితి మెజియాన్ ఎదుర్కొంది. ఉడెనాఫిల్ ఎన్డీఏ అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసే చర్యలను ఈ కంపెనీ ఇప్పటికే చేపట్టింది. మాకు సమాచారం లేదు... కేసు విషయాన్ని డాక్టర్ రెడ్డీస్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లగా... మెజియాన్ నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని, న్యూజెర్సీ స్టేట్ కోర్టు నుంచి లీగల్ నోటీసు కూడా ఏదీ రాలేదని స్పష్టం చేసింది. తమకు అధికారికంగా ఏదైనా సమాచారం వస్తే అప్పుడు స్పందిస్తామని డాక్టర్ రెడ్డీస్ ప్రతినిధి తెలిపారు. డాక్టర్ రెడ్డీస్‌కు చెందిన మిర్యాలగూడ, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్లాంట్లలో తనిఖీల సందర్భంగా పలు నిబంధనల ఉల్లంఘనలు, అతిక్రమణలు బయటపడడంతో 2015 నవంబర్‌లో ఎఫ్‌డీఏ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటి నుంచి బయటపడకముందే తాజాగా మెజియాన్ రూపంలో మరో సమస్యను కంపెనీ ఎదుర్కోనుంది. కాగా, అభ్యంతరాలు వ్యక్తం చేసిన ప్లాంట్లలో ప్రస్తుత త్రైమాసికంలోనే యూఎస్ఎఫ్డీఏ మరోసారి డిట్ నిర్వహిస్తుందని కంపెనీ భావిస్తోంది.