కొత్త గనులకు భూసేకరణే అడ్డంకి
నూతన చట్టంతో పనులకు బ్రేక్
యైటింక్లయిన్కాలనీ (కరీంనగర్) : సింగరేణికి భూసేకరణ తలకుమించిన భారంగా మారింది. పాతచట్టం ప్రకారం సర్వే పూర్తి చేసిన సింగరేణికి ఈఏడాది జనవరిలో రూపుదిద్దుకున్న కొత్తభూసేకరణ చట్టంతో వాటికి బ్రేక్ పడినట్లయింది. ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం ఇప్పటికే సర్వే నిర్వహించి నిధులు సమకూర్చుకున్న యాజమాన్యానికి తాజా చట్టం ప్రతిబంధకమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా శ్రీరాంపూర్లోని ఓసీపీ-2 కోసం 1,200 ఎకరాలు, మందమర్రి ఏరియాలో కేకేఓసీపీ, కాసిపేటగని, కేకే-6, 7 గనుల కోసం 2వేల ఎకరాలు, ఆర్జీ-3 ఏరియాలోని ఓసీపీ-2 కోసం 800ఎకరాలు, ఇళ్లు, భూపాలపల్లి లాంగ్వాల్ కోసం 800ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా సర్వేలు కూడా పూర్తయ్యాయి. భూసేకరణ నిమిత్తం సంస్థ రూ. 3వేల కోట్లు కేటాయించుకుంది. ఆ దశలోనే కేంద్రం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది.
అయితే, విధివిధానాలు ఖరారు చేసి జీవో కాపీలను రాష్ట్రాలకు పంపడంలో జాప్యం చోటుచేసుకుంటోంది. ఈక్రమంలో సింగరేణి భూసేకరణ పనులు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం ఉన్న గనుల్లో బొగ్గు నిల్వలు అడుగంటి పోవడం, కొత్తగనులకు భూ సేకరణ అడ్డంకిగా మారడంతో యాజమాన్యం డోలాయమానంలో పడింది. కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పం దించి భూసేకరణ విధివిధానాలను ప్రకటిస్తేనే యాజ మాన్యం కొత్త గనులపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.