విభజించు... దక్కించుకో...!
విభజించు....పాలించు సూత్రాన్ని ఇప్పుడు జిల్లాలో టీడీపీనేతలు అమలు చేయనున్నారు. రేషన్షాపులను తమ చేతుల్లోకి తెచ్చుకునేందుకు ఇప్పటికే డీలర్లపై ఆరోపణలు చేస్తున్న నేతలు, తాజాగా మరో ఎత్తు వేశారు. 250 కార్డులకు ఒక షాపు చొప్పున పునర్విభజించే అవకాశం ఉండడంతో షాపులను విభజించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వాటిని తమ అనుయాయులకు కేటాయించేందుకు పావులు కదుపుతున్నారని తెలిసింది.
విజయనగరం కంటోన్మెంట్ : మరో పందేరానికి రంగం సిద్ధమవుతోంది. జిల్లాలో ఉన్న రేషన్ దుకాణాలను విభజించి, అధిక పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని తమ అనుయాయులకు అప్పగించేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే డీలర్లను సస్పెండ్ చేసిన పలు రేషన్ దుకాణాల్లో దాదాపు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలతో సరుకులు విక్రయిస్తున్నారు. ఇప్పుడు వాటిని శాశ్వతంగా దక్కించుకోవడంతో పాటు, కొత్త రేషన్ డిపోలను ఏర్పాటు చేసి, తమ వారికి అప్పగించాలని యత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం కొన్ని ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నారు. తహశీల్దార్లపై ఒత్తిడి తెచ్చి ఆర్డీఓ కార్యాలయానికి పంపించి అక్కడి నుంచి తమ నాయకుల ద్వారా పనులు చేయించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పరి టాల సునీత చేసిన ప్రకటన వీరి ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చినట్టయింది. మంత్రి ప్రకటించిన మేరకు 500 కార్డులకు ఒక రేషన్ షాపు ఉండేలా త్వరలో జీఓ తీసుకు రానున్నారు.
దీంతో జిల్లాలో రేషన్ షాపుల సంఖ్య కనీసం వందవరకూ పెరుగుతుంది. జిల్లాలో ప్రస్తుతం 79 షాపులకు డీలర్లు లేరు. ఆ ఖాళీలను భర్తీ చేయ డంతో పాటు ఇన్చార్జ్లతో నడిపిస్తున్న, సస్పెండ్లో ఉన్న మరో 70 డీలరు స్థానాలపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. అంతే కాకుండా పరిమితికి మించి రేషన్ కార్డులున్న షాపులను పునర్విభజన చేసి వాటి స్థానాల్లో కొత్తగా డీలర్లను నియమించుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. వాస్తవానికి వెయ్యి రేషన్ కార్డులు దాటితేనే పునర్విభజన చేయాలన్న నిబంధన గతంలో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను 800కు తగ్గించినట్టు తెలుస్తోంది. అయితే జిల్లాలో రేషన్ షాపులను పునర్విభజన చేయాలని ఒత్తిడి తెస్తున్న కారణంగా కనీసం రేషన్ కార్డుల సంఖ్యను అమలు చేయాలని జిల్లా ప్రభుత్వ యంత్రాంగం భావిస్తున్నట్టు తెలిసింది. స్థానికులు, ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు (అక్కడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని) 250 రేషన్ కార్డులకు ఒక షాపును కూడా ఏర్పాటు చేయవచ్చు.
దీనికి తగిన కారణాలు చూపించాలి. తమ నాయకులు, కార్యకర్తలకు కలసి వచ్చేలా చాలాచోట్ల ఇదేమాదిరిగా రేషన్షాపులను పునర్విభజించాలని అధికార పార్టీ నేతలు ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నారు. జిల్లాలో 1365 రేషన్ షాపులున్నాయి. వీటిని బైఫర్కేషన్ చేస్తే 250 కార్డులకు ఒక షాపు లెక్కన 2344 షాపులవుతాయి. అయితే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, విభజనకు వీలులేని కొన్ని ప్రాంతాల్లోనూ(అధికార పార్టీకి చెందిన వ్యక్తులు డీలర్లుగా వ్యవహరిస్తున్న ప్రాంతాలు) విభజించరు. మిగతా చోట్ల రేషన్ షాపులను విభజిస్తే జిల్లాలో రేషన్ షాపులు పెరిగే అవకాశముంది. వీటిలో కొన్ని చోట్ల వెయ్యి కార్డులున్నవి, ఐదువందలున్నవీ, ఏడెనిమిది వందలున్నవీ ఉన్నాయి. వీటిలో రాజకీయ అవసరాల మేరకు పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కచ్చితంగా కొత్త రేషన్ షాపు కావాల్సిన చోట 250 కార్డులకు ఒక రేషన్ షాపును చేసేందుకు అవకాశాలున్నాయి. అదేవిధంగా పెద్ద రేషన్ షాపుల్లో 500నుంచి 600 కార్డులకు ఒక రేషన్ షాపును పెట్టేందుకు కూడా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఎన్ని రేషన్ షాపులు ఏర్పాటు చేయాలనే దానిపై అన్ని నియోజకవర్గాలనుంచి ఒక ప్రతిపాదనను కోరుతున్నట్టు తెలిసింది.
ఇంకా ఆదేశాలు రాలేదు.
జిల్లాలో రేషన్షాపులను పునర్వ్యవస్థీకరించేందుకు మార్గదర్శకాలు రాలేదు. ఇది వినియోగదారుల అవసరాలను బట్టి చేయాల్సిన ప్రక్రియ. కనీసం 250 కార్డులకు ఒక రేషన్ షాపు ఏర్పాటు చేయొచ్చు. జిల్లాలో చాలా వరకూ ఎక్కువ కార్డులున్న షాపులున్నాయి. ఇంకా ఎటువంటి ఆదేశాలూ రాలేదు.
-జే వెంకటరావు,
ఆర్డీఓ, విజయనగరం .