టీఎస్‌గా మార్పునకు రెడీ
రెండుమూడు రోజుల్లో స్పష్టత
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏపీ సిరీస్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు విషయంలో వాహనదారులు ఇబ్బంది పడకుండా రవాణా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నంబరు మార్పుతోపాటు కొత్త ఆర్సీ కార్డును ఒకేసారి అదే సమయంలో తీసుకోవాల్సిన అవసరం లేకుండా వారికి వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా తెలంగాణలోని ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసి.. ఆ వివరాల ప్రతులను వాహనదారులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. అలా పొందిన పత్రానికి నిర్ధారిత చెల్లుబాటు గడువు ఇస్తారు. ఆలోపు కొత్త నంబరుతో ఉన్న రిజిస్ట్రేషన్ కార్డును పొందాల్సి ఉంటుంది. అయితే ఎక్కడపడితే అక్కడ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలా? లేక ఈ-సేవ, స్థానిక ఆర్టీఏ కార్యాలయం ద్వారా మాత్రమే పొందే ఏర్పాటు చేయాలా అన్న విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ తాత్కాలిక పత్రాన్ని పొందేందుకు మాత్రం ప్రత్యేక రుసుము ఉండదని అధికారులంటున్నారు. కొత్త నంబరుతో ఉన్న ఆర్సీ కార్డుకు మాత్రం నిర్ధారిత రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అది ద్విచక్రవాహనాలకు, ఇతర వాహనాలకు వేరువేరుగా ఉంటుంది.
ప్రభుత్వ పరిశీలనకు అభ్యంతరాలు...
తెలంగాణకు టీఎస్ సిరీస్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలను కూడా కొత్త సిరీస్‌లోకి మార్చే విషయంలో ప్రజల నుంచి నామమాత్రంగా అభ్యంతరాలు వచ్చాయి. కొన్ని సంస్థలతోపాటు వ్యక్తుల నుంచి దాదాపు 35 అభ్యంతరాలు అధికారులకు అందాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో దీనిపై స్పష్టత ఇవ్వనుంది.