పట్టణ పేదలకోసం కొత్త రెంటల్ పాలసీ
న్యూడిల్లీ: కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదల కోసం మరోకొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. 100 స్మార్ట్ నగరాల్లో న్యూ రెంటల్ పాలసీని ప్రారంభించనుంది. ఆ ప్రణాళిక మొదటి భాగం వచ్చే ఆర్థిక సంవత్సరంనుంచి అమల్లోకి తేవచ్చని తెలుస్తోంది. గత 3 సంవత్సరాలుగా దీనిపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అమల్లోకి తేనుందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ప్రధానమంత్రి హైసింగ్ పథకంలో భాగంగా అందరికీ గృహ సదుపాయం లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో త్వరలోనే కేబినోట్ ను తయారు చేయనుందని పేర్కొంది. పట్టణ పేదరిక నిర్మూలనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంచినట్టు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నివేదించింది.
ప్రాథమికంగా 100 స్మార్ట్ నగరాలలో పట్టణ పేద లక్ష్యంగా ప్రారంభించబోతున్న ఈ సంక్షేమ పథకానికి రూ.2700కోట్లను కేటాయించింది. వలస కార్మికులకు, పట్టణ పేదలకు దీనికి సంబంధించిన రెంటల్ వోచర్లను పంపిణీ చేస్తుంది. స్థానిక ప్రజా సంస్థల ద్వారా వీటిని లబ్దిదారులకు అందించనున్నారు. అలాగే ఆయా పేదల అద్దె గృహాల అద్దెతదితర వివరాలను ఈ లోకల్బాడీలే నిర్ణయిస్తాయట. నిర్దేశిత వోచర్లకు విలువకు మించి అద్దె చెల్లించాల్సి వస్తే.. మిగిలిన నగదును అద్దెదారుడే భరించాల్సి ఉంటుందని మంత్రిత్వశాఖ అధికారి వివరించారు.