వ్యూహం మార్చిన మావోయిస్టులు..?
{పభుత్వాల పోకడలకు వ్యతిరేకంగా ప్రచారం
బెజ్జంగిలో ప్లీనరీ ఇందుకేనని అనుమానం
కొయ్యూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను సరికొత్త వ్యూహంతో తిప్పి కొట్టాలని మావోయిస్టులు యోచిస్తున్నారు. పోలీసులకు దీటుగా కరపత్రాలతోనే ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దళసభ్యులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వారికి వ్యతిరేకంగా ప్రచారం చేపడుతున్నాయి. వారు చేపడుతున్న హింస, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కరపత్రాలు ద్వారా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనిని తిప్పి కొట్టాలనే మావోయిస్టులు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని మల్కన్‌గిరి డివిజన్ బెజ్జంగి సమీపంలో ప్లీనరీ ఏర్పాటు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మావోయిస్టులు సమావేశాలు లేదా ప్లీనరీల ఏర్పాటుకు ఎక్కువగా మల్కన్‌గిరి డివిజన్‌ను ఎంచుకుంటారు.
అవసరమైన వస్తువులను చిత్రకొండ నుంచి తరలిస్తారు. ప్లీనరీ ఏర్పాటు చేస్తున్న సమాచారం చిత్రకొండలోనే బయటకు పొక్కిందని వారు అనుమానిస్తున్నట్టు సమాచారం. సాగుల సంఘటన నుంచి మావోయిస్టులపై పోలీసులు ఎదురుదాడికి పాల్పడుతున్నారు. నచ్చని వారిని దళసభ్యులు చంపేస్తున్నారంటూ కరపత్రా లు, బ్యానర్లతో ప్రచారం చేపట్టారు. ఇక వీరవరం సంఘటనతో ప్రచారాన్ని పోలీసులు మరింత ఉధృతం చేశారు. గిరిజనుల చైతన్యంతో మావోయిస్టులు కనుమరుగవుతారంటూ,విధ్వంసాలు, ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులను చంపేస్తున్న ఫొటోలతో సహా పోస్టర్లు అంటించారు. దీనిని తిప్పి కొట్టాలని మావోయిస్టుల అగ్ర నాయకత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ప్రభుత్వం ప్రజలకు ఏమి చెప్పింది తరువాత ఏమి చేస్తున్నది అనే అంశాలతో పాటు గిరిజనుల అక్రమ అరెస్టులపై కూడా ప్రకటనలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.