మూడు రకాల కొత్త సూపర్‌ఫాస్ట్ రైళ్లు
రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో మూడు కొత్త రకాల సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రకటించారు. పూర్తిగా థర్డ్ ఏసీ బోగీలతో కూడిన హమ్‌సఫర్ రైలు మొదటిది. ఇందులో కావల్సిన వాళ్లకు భోజనం కూడా పెడతారు. ఇక గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే తేజస్ రైలు రెండోది. ఇందులో వినోదం, స్థానిక ఆహారం, వై-ఫై సదుపాయాలు కూడా ఉంటాయి. ఈ రెండు రైళ్లకు కేవలం చార్జీల ద్వారానే నిర్వహణ వ్యయం మొత్తాన్ని రాబడతారు. వీటితో పాటు ఉదయ్ అనే పేరుతో ఓవర్‌నైట్ డబుల్ డెక్కర్ రైళ్లను, బిజీ మార్గాల్లో పూర్తిగా ఏసీ డబుల్ డెక్కర్ బోగీలతో కూడిన 'ఉత్కృష్ట్' రైళ్లను కూడా ప్రకటించారు.
వీటితో పాటు రిజర్వేషన్ లేని ప్రయాణికులకు నాణ్యమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను అంత్యోదయ అనే సూపర్ ఫాస్ట్ రైలును ప్రకటించారు. అలాగే, అన్ని రైళ్లలోనూ 'దీన్‌దయాళు' పేరుతో ఉండే అన్ రిజర్వుడు బోగీలలో మంచినీళ్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లను కూడా ప్రవేశపెడుతున్నారు.