91 లక్షల కొత్త టాక్స్ పేయర్స్,30కోట్ల పాన్‌కార్డ్స్
న్యూఢిల్లీ: నోట్ల రద్దుతరువాత నల్లధనం వెలికితీత లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త వెబ్‌సైట్‌ను మంగళవారం లాంచ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ క్లీన్ మనీ ప్రచారంలో భాగంగా క్లీన్‌మనీ వెబ్ సైట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ లాంచ్ చేశారు. డీమానిటైజేషన్ తరువాత వ్యక్తిగత ఆదాయ పన్ను దాఖలులో పురోగతి సాధించామని అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అధిక ఆదాయం, పన్నుల ఎగవేత ఇక ముందు సాగదని జైట్లీ హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్, మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నివాసాలపై సీబీఐ దాడులపై స్పందించిన ఆర్థికమంత్రి షెల్ సంస్థల ద్వారా భారీ ఆస్తులను కొనుగోలు చేయడం చిన్న విషయంకాదని వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ క్లీన్ మనీలో 91 లక్షల కొత్త పన్ను చెల్లింపుదారులు జత చేరినట్టు సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు. ఈ ఫైలింగ్ లో ఆదాయ వివరాలు దాఖలు 22 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే అప్రకటిత ఆదాయం రూ. 16, 398కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఆపరేషన్ క్లీన్ మనీ లో దాదాపు లక్ష ఖాతాల డిపాజిట్లు హై రిస్క్ జోన్లో ఉన్నాయని, పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. 30కోట్ల పాన్ కార్డులను జారీ చేసినట్టు ప్రకటించారు.