new tenders
-
సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం..మళ్లీ అదే పని
సాక్షి, ఆదిలాబాద్ : మళ్లీ అద్దె బస్సుల కోసం టెండర్ వేశారు. ఆర్టీసీలో కొత్తగా అద్దె బస్సులు తీసుకునేందుకు తిరిగి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఒకవైపు కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవల అద్దె బస్సుల టెండర్ల విషయంలో కార్మికులు ఆందో ళన వ్యక్తం చేసినా, మొదటి దఫా ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండానే మరో దఫా టెండర్లకు సిద్ధం కావడం గమనార్హం. అన్ని డిపోల కోసం.. సమ్మె సమయంలోనే మరోసారి అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ విడతలో పెద్ద ఎత్తున బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిగల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్ డిపోల నుంచి వివిధ రూట్లలో బస్సులను నడిపేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియకు శనివారం చివరి రోజు. ఆదిలాబాద్ ఆర్ఎం కార్యాలయంలో ఉంచిన టెండర్ బాక్సులో దరఖాస్తు దాఖలు చేయాలి. సాయంత్రమే వీటికి సంబంధించి టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న సంఖ్య.. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని ఆరు డిపోలు ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల్లో కలిపి మొత్తంగా నిత్యం 625 బస్సులు ఉన్నాయి. ఇందులో 181 అద్దె బస్సులు ఉండగా, మిగతావి ఆర్టీసీవి. ప్రభుత్వం ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా వందకుపైగా అద్దె బస్సులను తీసుకుంటోంది. తద్వారా ఆర్టీసీలో వీటి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఒకవైపు సమ్మె చేస్తున్న కార్మికులు టెండర్ నోటిఫికేషన్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఇవన్నేమీ పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం టెండర్ ప్రక్రియ విషయంలో కార్మికులు మరోసారి ఆందోళనకు దిగే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దంటూ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమ్మెకు ముందు ఆర్టీసీ బస్సులు రోజు 2.50 లక్షల కిలోమీటర్లు తిరిగి సుమారు 3లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతోంది. తద్వారా ఆర్టీసీకి రోజూ రూ.75లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఆదాయం లభించేది. సమ్మె తర్వాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇప్పటికీ రోజువారి ఆదాయం విషయంలో ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. తద్వారా నడుస్తున్న కొద్దిపాటి బస్సుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటు పోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. కొనసాగుతున్న సమ్మె ఆదిలాబాద్ రీజియన్‌లో సమ్మె 21 రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు తాత్కాలిక డ్రైవర్లను నియమించి నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి పూర్తిస్థాయిలో సఫలం కావడంలేదు. శుక్రవారం రీజియన్ పరిధిలో 326 ఆర్టీసీ బస్సులను నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నా కేవలం 262 బస్సులను నడిపినట్లు అధికారులే చెబుతున్నారు. అద్దె బస్సులు 172కు గాను 166 నడిపించారు. మొత్తంగా ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి 478 నడిపించాలని అనుకున్నా 428 బస్సులు తిరిగినట్లు చెబుతున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి సంఘీభావం లభించింది. ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే.. ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అద్దె బస్సులను కొత్త నోటిఫికేషన్ల ద్వారా తీసుకుంటోంది. ఇది సబబు కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఉద్దేశం సరికాదు. కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాలు తగదు. – బీడీ చారి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ప్రభుత్వ ధోరణితోనే సమస్య ప్రభుత్వ ధోరణితోనే సమస్య జఠిలమవుతోంది. సమ్మె కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోంది. చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. విలీన డిమాండ్ ఒక్కటే కాకుండా ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. అవన్ని పరిష్కార యోగ్యమైనవే. కాని చర్చల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడంలేదు. – ఎంఆర్ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ -
పెట్టుబడులు, టెండర్లు ఆపేయండి
న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్ హెడ్స్‌కు బీఎస్ఎన్ఎల్ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్ఎన్ఎల్ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్ హెడ్స్‌కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి. ప్రైవేట్ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇవన్నీ బీఎస్ఎన్ఎల్ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి. 2014–15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్ఎన్ఎల్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016–17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్ ఎన్‌ఎల్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎస్కే గుప్తా గత నెలలో చీఫ్ జనరల్ మేనేజర్స్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు. -
ఖనిజ దోపిడీపై.. ఆరా
ఓబులవారిపల్లె: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట శాఖలో దోపిడీకి గురవుతున్న బెరైటీస్ ఖనిజంపై శుక్రవారం విచారణ ప్రారంభమైంది. సంస్థలో ఖనిజ దోపిడీపై స్థానికులు ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ఈ విషయమై పూర్తిగా విచారించాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిని కోరింది. దీంతో ఖనిజ దోపిడీపై విచారించి నివేదిక అందించాలని ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్‌కు పరిశ్రమల కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈడీ నాగరాజు శుక్రవారం మంగంపేటకు చేరుకున్నారు. ఒక్కొక్క విభాగం అధికారులను ప్రత్యేకంగా పిలిపించి విడివిడిగా విచారించారు. అంతకు ముందు బెరైటీస్ గనులు, డంపింగ్ప్లాట్లను పరిశీలించి ఖనిజోత్పత్తి వివరాలు అడిగితెలుసుకున్నారు. తరచూ జరుగుతున్న ఖనిజ దోపిడీపై జియాలజీ విభాగం, హెచ్ఆర్డీ, లోడింగ్, అన్లోడింగ్, వేబ్రిడ్జి విభాగాలతో పాటు సెక్యూరిటీ వారిని విడివిడిగా విచారించి వారి నుంచి వచ్చిన సమాధానాలను నమోదు చేశారు. అలాగే బెరైటీజ్ పల్వరైజింగ్ మిల్లుల పనితీరుపై ఏపీఎండీసీకి చెందిన 14 మంది అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు. తమకు ఏపీఎండీసీ వారు ఖనిజాన్ని సక్రమంగా సరఫరాచేయకపోవడంతో మిల్లులు పతనావస్థకు చేరుకున్నాయని కొంతమంది మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మిల్లుల పనితీరు, ఏపీఎండీసీ నుంచి ఖనిజం సక్రమంగా అందుతుందా లేదా అనే అంశంపైనా కూడా విచారిస్తున్నట్లు ఈడీ హెచ్డీ నాగరాజు స్పష్టంచేశారు. మిల్లు యజమానులు బెరైటీస్‌ను బయట విక్రయిస్తున్నారా లేక క్రషింగ్ చేస్తున్నారా అనేది ప్రధానాంశంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏపీఎండీసీలో బెరైటీస్ ఖనిజానికి ప్రతి మూడు సంవత్సరాలకోసారి నిర్వహించే సేల్స్టెండర్లకు ఈనెల 7వ తేదీకి గడువు పూర్తవుతుంది. 8వ తేదీ నుంచి కొత్త టెండర్ల ద్వారా వచ్చే ధరలతో ఖనిజ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే కొత్త టెండర్లు నిర్వహిస్తామని ఈడీ నాగరాజు విలేకరులతో అన్నారు. -
జలయజ్ఞం పనులకు కొత్త టెండర్లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జరుగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఛాంబర్లో శనివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులు వేగంగా జరగాలంటే ప్రస్తుతం అర్ధాంతరంగా నిలిపివేసిన కాంట్రాక్టర్లను తొల గించి, కొత్తవారికి అప్పగించాలని పలువురు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కోండ్రు ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించారని తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో జలయజ్ఞం కింద పలు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అందులో వంశధార కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ ముఖ్యమైనది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు మధ్యలోనే వాటిని నిలిపివేశారు. వంశధార 87, 88 ప్యాకేజీలకు సంబంధించి కోర్టు కేసులు ఉండటంతో సుమారు ఐదేళ్లుగా పనులు ఆగిపోయాయి. ఇప్పటి వరకు 30 శాతం పనులు మాత్రమే జరిగాయి. దీంతో అంచనా వ్యయం కూడా దాదాపు రెట్టింపయ్యే అవకాశమున్నందున పాత అంచనాల ప్రకారం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. అందువల్ల ఈ రెండు ప్యాకేజీలను రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఇరిగేషన్ మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. వంశధార, నాగావళి వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన కరకట్టల నిర్మాణాల్లో 1, 2, 3 ప్యాకేజీల పనులు కూడా నిలిచిపోయాయి. కొత్త అంచనాలతో టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. నారాయణపురం ఆధునికీకరణతోపాటు ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు సైతం కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కాగా 2009లో ప్రభుత్వం తోటపల్లి విస్తరణ ప్రాజెక్టుకు రూ.138 కోట్లు మంజూరు చేసింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య పాలకొండ సమీపంలోని నవగాం వద్ద శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ పనులు కూడా ముందుకు సాగనందున పాత కాంట్రాక్టులు రద్దు చేసి, కొత్త వారికి అప్పగించాలని, పనులు వెంటనే చేపట్టాలని ఈ సమావేశంలో అధికారులను ఆదేశించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ 61 ప్రకారం కాంట్రాక్టర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని రికవరీ పెట్టి కొత్తగా టెండర్లు పిలవడం ద్వారా పనులు వేగవంతం చేయాలని మంత్రులు సుదర్శన్‌రెడ్డి, కోండ్రు మురళీమోహన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ కార్యదర్శులు ఆదిత్యనాథ్, అరవిందరెడ్డి, ఈఎన్సీ మురళీధర్, నారాయణరెడ్డి, ఎం వెంకటేశ్వరావు, నార్త్ కోస్ట్ ప్రాజెక్ట్స్ సీఈ జలంధర్, వంశధార ప్రాజెక్ట్ ఎస్ఈ రాంబాబులు పాల్గొన్నారు.