ఓబులవారిపల్లె: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట శాఖలో దోపిడీకి గురవుతున్న బెరైటీస్ ఖనిజంపై శుక్రవారం విచారణ ప్రారంభమైంది. సంస్థలో ఖనిజ దోపిడీపై స్థానికులు ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ ఈ విషయమై పూర్తిగా విచారించాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిని కోరింది. దీంతో ఖనిజ దోపిడీపై విచారించి నివేదిక అందించాలని ఏపీఎండీసీ మేనేజింగ్ డెరైక్టర్‌కు పరిశ్రమల కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈడీ నాగరాజు శుక్రవారం మంగంపేటకు చేరుకున్నారు. ఒక్కొక్క విభాగం అధికారులను ప్రత్యేకంగా పిలిపించి విడివిడిగా విచారించారు. అంతకు ముందు బెరైటీస్ గనులు, డంపింగ్‌ప్లాట్లను పరిశీలించి ఖనిజోత్పత్తి వివరాలు అడిగితెలుసుకున్నారు.
తరచూ జరుగుతున్న ఖనిజ దోపిడీపై జియాలజీ విభాగం, హెచ్‌ఆర్‌డీ, లోడింగ్, అన్‌లోడింగ్, వేబ్రిడ్జి విభాగాలతో పాటు సెక్యూరిటీ వారిని విడివిడిగా విచారించి వారి నుంచి వచ్చిన సమాధానాలను నమోదు చేశారు. అలాగే బెరైటీజ్ పల్వరైజింగ్ మిల్లుల పనితీరుపై ఏపీఎండీసీకి చెందిన 14 మంది అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి శుక్రవారం మూకుమ్మడి తనిఖీలు నిర్వహించారు. తమకు ఏపీఎండీసీ వారు ఖనిజాన్ని సక్రమంగా సరఫరాచేయకపోవడంతో మిల్లులు పతనావస్థకు చేరుకున్నాయని కొంతమంది మిల్లుల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
మిల్లుల పనితీరు, ఏపీఎండీసీ నుంచి ఖనిజం సక్రమంగా అందుతుందా లేదా అనే అంశంపైనా కూడా విచారిస్తున్నట్లు ఈడీ హెచ్‌డీ నాగరాజు స్పష్టంచేశారు. మిల్లు యజమానులు బెరైటీస్‌ను బయట విక్రయిస్తున్నారా లేక క్రషింగ్ చేస్తున్నారా అనేది ప్రధానాంశంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏపీఎండీసీలో బెరైటీస్ ఖనిజానికి ప్రతి మూడు సంవత్సరాలకోసారి నిర్వహించే సేల్స్‌టెండర్లకు ఈనెల 7వ తేదీకి గడువు పూర్తవుతుంది. 8వ తేదీ నుంచి కొత్త టెండర్ల ద్వారా వచ్చే ధరలతో ఖనిజ విక్రయాలు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వం ఆదేశిస్తే కొత్త టెండర్లు నిర్వహిస్తామని ఈడీ నాగరాజు విలేకరులతో అన్నారు.
ఖనిజ దోపిడీపై.. ఆరా
Published Sat, Aug 2 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement