న్యూఢిల్లీ: ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను టెలికం శాఖ (డాట్) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్ ఆఫీసర్ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్ హెడ్స్‌కు బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్‌ఎన్‌ఎల్ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్ హెడ్స్‌కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్‌ఎన్‌ఎల్ వర్గాలు తెలిపాయి.
పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి. ప్రైవేట్ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇవన్నీ బీఎస్‌ఎన్‌ఎల్ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి.
2014–15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్‌ఎన్‌ఎల్ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016–17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్ ఎన్‌ఎల్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ ఎస్‌కే గుప్తా గత నెలలో చీఫ్ జనరల్ మేనేజర్స్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment