చాంపియన్స్ లీగ్ స్థానంలో మినీ ఐపీఎల్?
ముంబై: విఫల ప్రయత్నంగా మిగిలిన చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ స్థానంలో మరో కొత్త టోర్నమెంట్‌ను నిర్వహించాలా వద్దా అనే అంశంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఈ టోర్నీని నిర్వహించడం కష్టమని ఇప్పటికే బోర్డు వర్గాలు నిర్ణయించినా... ఇంకా అధికారికంగా మాత్రం రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దాంతో సీఎల్‌టి20 అంశాన్ని చర్చించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నెల 8న సమావేశం కానుంది.
ఈ టోర్నీకి ప్రతి ఏటా కేటాయిస్తున్న మూడు వారాల సమయాన్ని మరో రకంగా ఉపయోగించుకోవాలనేది బోర్డు పెద్దల ఆలోచన. ఈ నేపథ్యంలో మూడు రకాల ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్‌లాంటిది నిర్వహించడం ఇందులో మొదటిది. మిగతా మూడు జట్లతో లీగ్ మ్యాచ్‌లు, అనంతరం ఫైనల్ ఇందులో ఉంటుంది.
ఇదే తరహాలో రెండో ప్రత్యామ్నాయంగా బేబీ ఐపీఎల్ పేరుతో టోర్నీ నిర్వహించడం. ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి అనంతరం రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం. ఈ రెండూ కాకుండా ఆ తేదీల్లో వెస్టిండీస్‌ను పిలిచి మరో సిరీస్ ఆడించి గత ఏడాది నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం గురించి వినిపిస్తున్నా...తొలి రెండింటిలో ఒకదానికే కౌన్సిల్ ఓటు వేయవచ్చు.