అగ్నియోధుడి అంతరంగం
9/11 దుర్ఘటన నెత్తుటి శిథిలాలు, కన్నీటి శకలాలు ఇప్పటికీ ఎన్నో కథలు చెబుతూనే ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అగ్నియోధుల (ఫైర్‌ఫైటర్స్) గురించి. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో లేచిన అగ్నికీలలలో న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎఫ్డిఎన్వై)కు చెందిన 343 మంది ఫైర్‌ఫైటర్లు అమరులయ్యారు. ఉద్యోగం అంటే ఉపాధి మాత్రమే కాదని పరుల కోసం చేసే త్యాగమని, మృత్యువుకి చేరువలో ఉన్నవారిని కాపాడటం అని, ఉద్యోగం అంటే ఉక్కు నిబద్ధత అని, అవసరమైతే ఇతరుల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడం కూడానని నిరూపించారు ఆ అగ్నియోధులు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రమాదంలో మృత్యు శిఖరపు అంచుల వరకూ వెళ్లి, అదృష్టవశాత్తూ వెనక్కి తిరిగొచ్చాడు కెవిన్ ముర్రే. మన్‌హట్టన్ ఈస్ట్ సెకండ్ స్ట్రీట్‌లోని ఫైర్హౌజ్లో ఫైర్ ఫైటర్‌గా పని చేసే కెవిన్... నాటి సంఘటన గురించి పంచుకున్న జ్ఞాపకాలు ఇవి. స్థూలదృష్టితో చూస్తే ఫైర్ఫైటర్లందరి సామూహిక అంతరంగమిది. ‘జనం కోసం నేను’ అనే మానవత్వ నినాదానికి నిలువెత్తు రూపమిది.
‘ఆఫీసులోకి అడుగుపెట్టగానే పెద్ద మీసాల మైక్ కెల్టీ అంటున్నాడు... వృత్తి జీవితంలో ప్రతి రోజూ ఒక యుద్దమే’ అని. మోములో లేతదనం ఇంకా పోని కొత్త కుర్రాడు కెమరాట్ నవ్వుతూ వింటున్నాడు. మధ్యలో ఎప్పటిలాగే ఏవో సందేహాలు అడుగుతున్నాడు. ఆ దృశ్యం నాకు తరచుగా కనిపించేది. ఇప్పటికీ కనిపిస్తోంది. కానీ తేడా అల్లా ఒక్కటే. అప్పుడు వాళ్లు జీవించి ఉన్నారు. ఇప్పుడు లేరు. ఈ ఇద్దరు మాత్రమే కాదు... వీరితో పాటు గోడ మీద ఛాయాచిత్రాలుగా మిగిలిన నా నలుగురు సహోద్యుగులు కూడా బతికిలేరు. వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడిలో మంటల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించే క్రమంలో కన్నుమూశారు. వాళ్లను తలచుకుంటే నాకు కన్నీరు ఆగదు. అలాగని కర్తవ్యం వెనక్కిపోదు.
మామూలుగా అందరూ ‘మంటలకు దూరంగా ఉండాలి’ అని చెబుతుంటారు. మాకు మాత్రం ‘మంటలు ఎక్కడుంటే అక్కడ ఉండండి’ అని శిక్షణ సమయంలో చెప్పారు. మన్‌హట్టన్ ఈస్ట్ సెకెండ్ స్ట్రీట్‌లోని ఫైర్హౌజ్లో పనిచేస్తాను నేను. మా ఆఫీసు గోడలపై, వాహనాలపై ‘లక్కీ ఎలెవన్’ అనే వాక్యం కనిపిస్తుంది. 9/11 ముందు వరకు నేను కూడా అలాగే అనుకున్నాను.
ఆరోజు ఉదయం కొలీగ్స్‌తో కలిసి క్యాఫ్టీరియాలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. ఇంతలో పిడుగుపాటులాంటి వార్త కంట్రోల్‌రూమ్ నుంచి వచ్చింది. డబ్ల్యూటీసీ టవర్లను ఒక విమానం ఢీకొందని! ఇదేదో ప్రమాదవశాత్తూ జరిగిన దుర్ఘటన అనుకున్నాంగానీ రెండో విమానం ఢీకొన్న తరువాతే ఇది ఉగ్రవాదుల కుట్ర అనే విషయం తెలిసింది. అప్పటి వరకు ఉన్న ధైర్యం హఠాత్తుగా మాయమైపోయింది. ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. అంతలోనే నార్త్ టవర్లోని 10-15వ అంతస్తుల్లో ఉన్నవారిని రక్షించాల్సిందిగా అధికారుల ఆదేశం. వెంటనే బయలుదేరాం. నా మనసు నిండా ఏవేవో ఆలోచనలు. నా కుటుంబం పదేపదే కళ్ల ముందు కదలాడుతోంది.
మా వాహనం వేగంగా దూసుకు వెళుతోంది. ఆ వేగంతో సరిసమానంగా ధైర్యానికి, అధైర్యానికి మధ్య యుద్ధం ఒకటి నాలో జరుగుతోంది. చరిత్రలో ఫైర్‌ఫైటర్ల సాహసాలను, త్యాగాలను గుర్తుచేసుకున్నాను. ‘మంటకు నువ్వు భయపడడం కాదు... మంటే నిన్ను చూసి భయపడి పారిపోవాలి’ అన్నాడు ఒకసారి మా పై అధికారి సరదాగా. అది సరదాగా అన్నా అందులో గొప్ప సత్యం ఉంది. ‘నా ప్రాణాలు అడ్డుపెట్టయినా సరే, ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించాలి’ అనే ధైర్యం మరుక్షణం నా నరనరాల్లోకి ప్రవహించింది.
దట్టమైన పొగలు. మంటలు. ఆకాశం నుంచి మనుషులు రాలిపడుతున్నారు. ఎప్పుడూ చూడని దృశ్యం! పని చేయని లిఫ్ట్‌లు... దెబ్బతిన్న కమ్యునికేషన్, వాటర్ పైప్‌లు పగిలిపోయి కాళ్లకు అడ్డం తగులుతున్న నీళ్లు, చెత్తా చెదారం... ముందడుగు వేయడానికి ప్రతిదీ ప్రతికూలంగానే ఉంది. ప్రతి అంతస్తూ ఒకదాన్ని మించి ఒకటి దారుణంగా ఉన్నాయి.
మరోపక్క జనాలు అరుస్తున్నారు. భయంతో కేకలు పెడుతున్నారు... ‘ఢీ కొట్టడానికి మూడో విమానం వస్తుంది’ అని. అదెంత వరకు నిజమో మాకు కూడా తెలియదు. కానీ అలాంటిదేమీ లేదని వారికి ధైర్యం చెప్పాం. ఆ చీకట్లో టార్చిలైట్ల వెలుగులో మెట్లమార్గం గుండా జనాలను బయటికి సురక్షితంగా తీసుకువెళ్లడం ప్రారంభించాం. సాంకేతిక వ్యవస్థ కుప్పకూలిపోయి, ఆ శిథిలాలే మాపై గురి పెట్టిన ఆయుధాలైన ఆ సమయంలో... ఇతరులను రక్షించడం మాటేమిటోగానీ, మా బృందంలో ఏ ఒక్కరూ బతికే అవకాశమే లేదని అనిపించింది.
40వ ఫ్లోర్ నుంచి దూసుకువచ్చిన ఒక ఫైర్‌మన్ పెద్దగా అరుస్తూ ‘సౌత్ టవర్‌లాగే ఇదీ (నార్త్ టవర్) కుప్పకూలిపోనుంది’ అన్నాడు హెచ్చరికగా. అధికారుల ఆదేశాలను వినే స్థితిలో అతడు లేడు. ఈలోపు పెద్ద శబ్దం వినిపించింది. నార్త్‌టవర్ నేలమట్టం కావడానికి సిద్ధంగా ఉంది. అందరం వేగంగా కదిలాం. ఓపక్క పక్కవాళ్లను కాపాడాలన్న తపన. మరోపక్క మమ్మల్ని మేము కాపాడుకోగలమా అన్న సందేహం. సకాలంలో బయటపడటం వల్లో, అదృష్టం వల్లో నా ప్రాణాలు మిగిలాయి. కానీ ఎంతోమంది చనిపోయారు. నాతో కలిసి పనిచేసినవాళ్లు ఎంతోమంది అసువులు బాశారు. ఎన్నో ప్రమాదాల్లో అగ్ని కీలలను ఛేదించి నిలబడినవాళ్లు ఈ ప్రమాద కోరల నుంచి తప్పించుకోలేక పోయారు.
నాటి దృశ్యాలు... మృత్యువాకిట నిలబడి నిస్సహాయంగా చూస్తూ నిలబడినవారి ముఖాలు... అన్నీ గుర్తొస్తే ఇప్పటికీ నా మనసు కదిలిపోతుంది. నేను ప్రాణాలతో బయటపడ్డాను కానీ దుమ్ము, రసాయనాల వల్ల నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నాలాగే ఎంతోమంది ఫైర్ఫెటర్లు చాలాకాలం పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. కొందరు క్యాన్సర్‌తో చనిపోయారు. ఆ పీడకలను మర్చిపోలేక ఇప్పటికీ కొందరు ఉలికులికి పడుతున్నారు.
ఇదీ కెవిన్ ముర్రే అంతరంగం. నిజమే. ఫైర్ ఫైటర్ జీవితం అంటే నిప్పుతో చెలగాటం. వాళ్ల పోరాటం మృత్యువుతోటి. గెలుస్తారో ఓడిపోతారో ఎవరికీ తెలియదు. అయినా ప్రతిసారీ మృత్యువుతో తలపడు తుంటారు. సహచరుల్ని కళ్లముందే కోల్పో తున్నా గుండెల్ని రాయి చేసుకుంటారు. తమను కబళించడానికి నిప్పు నాలుకలు చాస్తున్నా ధైర్యంగా ముందుడుగు వేస్తారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి, ఎందరికో ప్రాణభిక్ష పెడుతుంటారు. అలాంటి వీరులందరికీ వందనం!
అగ్నిపూలు
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది మొత్తం మహిళలే. పురు షులకు మహిళలు ఏమాత్రం తీసిపోరని చెప్పడానికే ప్రభుత్వం ఇలా మహిళల్ని నియమించింది. అగ్నిమాపక విభాగంలో పనిచేయడం అంత తేలిక కాదు. బరువులు ఎత్తాలి. పరుగులు తీయాలి. ఒక్కోసారి ప్రాణాన్ని పణంగా పెట్టాలి. అయినా వీళ్లు తమ సత్తా చాటుతున్నారు. నిప్పుతో చెలగాటం ఆడుతూ... ఆడవాళ్లంటే కుసుమ కోమలమైన వాళ్లే కాదు, అవసరమైతే కఠిన సమయాల్లో తెగువనూ ప్రదర్శించగలమని నిరూపిస్తున్నారు. ఉమెన్ ఫైర్ ఫైటర్లుగా కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు.
ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే సింబల్ రెడ్, బ్లూ కలగలిసిన రిబ్బన్. సింబల్‌లోని ఎరుపు అగ్నిని, నీలం జలాన్ని ప్రతిబింబిస్తాయి. ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే సారాన్ని ఏ మాటలూ లేకుండానే లోకానికి చాటుతుంది ఈ రిబ్బన్.
ఫైరున్న ఫైటర్!
ఫైర్‌తో ఫైట్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగమే అక్కర్లేదని నిరూపిస్తు న్నాడు బిపిన్ గణత్రా (కోల్‌కతా). పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసే బిపిన్ ముఖ్యమైన పని మాత్రం మంటలను ఆర్పడం. ‘సిటీ ఆఫ్ ఫైర్స్’గా పేరున్న కోల్‌కతాలో అగ్నిప్రమాదాలు ఎక్కువ. ఏ ప్రమాద వార్త తెలిసినా అక్కడికి వెళ్లి మంటలను ఆర్పడంలో సహాయం చేస్తాడు బిపిన్. చిన్నప్పుడు ఫైర్ ఇంజిన్ బెల్లు వినిపించ గానే ఇంట్లో నుంచి పరుగెత్తుకు వచ్చేవాడట.
ఫైర్ ఇంజిన్ వెంట పరుగులు తీసి అగ్నిప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేవాడట. అక్కడ చూసిన ఫైర్‌మెన్ కష్టం బాల్యంలోనే అతడి మనసులో ముద్రపడింది. పెద్దయ్యాక ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా వెళ్లడం, తన వంతుగా అగ్నిమాపక సిబ్బందికి సహాయం అందించడం అలవాటైంది. ‘‘ఫైర్ ఫైటింగ్లో శిక్షణ లేకపో వచ్చు కానీ చిత్తశుద్ధి ఉంది. అతడు మా ఫైర్‌మెన్‌కు మార్గదర్శి. ఇలాంటి వాళ్లు అరుదు’’ అని బిపిన్ గురించి ప్రశంసాపూర్వకంగా చెప్తారు కోల్‌కతా సిటీ ఫైర్ సర్వీస్ చీఫ్ ప్రసాద్ ఘోష్.