ట్రంప్ గౌరవంగా మాట్లాడారు
వెల్లింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నోటి దురుసు ఎక్కువన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే జడ్జి అయినా సరే అస్ట్రేలియా ప్రధాని అయినా సరే వదలిపెట్టరు. ఏడు దేశాల నుంచి ముస్లిం రాకపై నిషేధాన్ని వ్యతిరేకించిన జడ్జి, శరణార్థుల విషయంలో తన మాట వినని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్లపై ట్రంప్ నోరు పారేసుకున్నారు. శరణార్థులపై నిషేధం విషయంలో విమర్శలను, వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోలేదు. కాగా ట్రంప్ ఇదే విషయంపై .. ఆస్ట్రేలియా పక్కన ఉన్న న్యూజిలాండ్ దేశ ప్రధాని బిల్ ఇంగ్లీష్‌తో మాత్రం గౌరవంగా మాట్లాడారట.
సోమవారం బిల్ ఇంగ్లీష్‌కు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. శరణార్థులపై నిషేధం సహా పలు విషయాలకు సంబంధించి ఇద్దరూ 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య చర్చలు గౌరవప్రదంగా, సామరస్యపూర్వకంగా జరిగాయని న్యూజిలాండ్ ప్రధాని చెప్పారు. శరణార్థులపై నిషేధం విధించాలన్న ట్రంప్ నిర్ణయంతో తాను ఏకీభవించలేదని చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని అన్నారు. చైనా, ఉత్తర కొరియా దేశాల విషయంలో కూడా ఇద్దరూ చర్చించామని న్యూజిలాండ్ ప్రధాని తెలిపారు. ఈ చర్చల విషయంపై వైట్ హౌస్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ భద్రత, శాంతికి న్యూజిలాండ్ కృషిచేస్తోందని, ఆ దేశానికి ధన్యవాదాలు అంటూ పేర్కొంది.