శ్రీవారి కల్యాణకట్టలో ఆధునిక వసతులు
సాక్షి,తిరుమల : శ్రీవారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తుల సౌకర్యం కోసం కొత్త హాలును శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ప్రధాన కల్యాణకట్టలో మొత్తం నాలుగు హాళ్లు ఉన్నాయి. ఇందులో ప్రయోగాత్మకంగా ఈ హాలు ఆధునికీకరించారు. అదనంగా ఆరు టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చదలవాడ మాట్లాడుతూ, తలనీలాలు సమర్పించేందుకు సామాన్య భక్తులు ఎక్కువ సమయం క్యూలో వేచి ఉండకుండా ఉండేందుకు ఈ కొత్త హాలు ఉపయోగపడుతుందన్నారు. భక్తుల కోసం కాఫీ, టీ కూడా ఉచితంగా అందిస్తారన్నారు. టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ కొత్త హాలు, కొత్త టోకెన్ కౌంటర్లు అందుబాటులోకి తీసుకురావడంతో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవకాశం ఉండదన్నారు. అలాగే పూర్తి స్థాయి పారిశుద్ధ్యం వల్ల తలనీలాలు తీసుకునే భక్తులు, వృత్తిని కొనసాగించే క్షురకులకు ఆరోగ్య సమస్యలు రావన్నారు. దశలవారీగా మరో మూడు హాళ్లను కూడా పూర్తి స్థాయిలో ఆధునికీకరిస్తామన్నారు. కార్యక్రమంలో ఢిల్లీలోని ఏపీ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు,టీటీడీ న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, వీఎస్వో రవీంద్రారెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శర్మిష్ట, డెప్యూటీ ఈవో వెంకటయ్య పాల్గొన్నారు.