వచ్చే ప్రపంచకప్ పది జట్లతోనే
తేల్చిన ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్
మెల్బోర్న్: వచ్చే ప్రపంచకప్‌ను పది జట్లతోనే నిర్వహించాలనే విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కృతనిశ్చయంతో ఉంది. ఈ నిర్ణయంపై అసోసియేట్ దేశాలతో పాటు పలువురు దిగ్గజ ఆటగాళ్ల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా ఐసీసీ ఖాతరు చేయడం లేదు. ‘2019 ప్రపంచకప్‌కు టాప్-8 ర్యాంకు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి.
మిగిలిన రెండు స్థానాల కోసం ఆరు అసోసియేట్ దేశాల మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి చిన్న జట్లకు కూడా ఈ మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉన్నట్టే కదా. ఐసీసీ అభివృద్ధి కార్యక్రమం ద్వారానే అసోసియేట్స్ విజయవంతం కాగలిగాయి’ అని ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఐసీసీకి అనుబంధంగా ఉన్న దేశాల్లో క్రికెట్‌ను అభివృద్ధి పరిచేందుకు వచ్చే ఎనిమిదేళ్ల కాలంలోతాము 300 మిలియన్ డాలర్లు వెచ్చిస్తామన్నారు.