గోవాలో మహాకూటమి
జట్టుకట్టిన ఎంజీపీ, జీఎస్ఎం, శివసేన
పణాజి: బీజేపీ అవకాశాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం మహారాష్ట్రవాడి గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా సురక్షా మంచ్(జీఎస్ఎం), శివసేన మహాకూటమిగా ఏర్పడ్డాయి. జీఎస్‌ఎంను ఆరెస్సెస్ తిరుగుబాటు నేత సుభాష్ వెలింగ్కర్ స్థాపించగా, ఎంజీపీ ఈ మధ్యే అధికార బీజేపీతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో , మహారాష్ట్రలో బీజేపీ భాగస్వామిగా ఉన్న శివసేన తొలిసారి గోవాలో అదృష్టం పరీక్షించుకోబోతోంది. 35 నుంచి 40 సీట్లలో పోటీచేయబోతున్న ఈ కూటమి ఎంజీపీ నాయకుడు సుదిన్ ధావలికర్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. వెలింగ్కర్ కన్వీనర్‌గా ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ‘ భాగస్వాముల మధ్య సీట్ల పంపకంతో ఎన్నికల్లో పోటీచేస్తాం. ఇది భావసారూప్యాలున్న పార్టీల కలయిక’ అని సుదిన్ ధావలికర్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతున్న పాఠశాలలకు ప్రభుత్వ గ్రాంట్లను ఉపసంహరించుకోవడమే తొలి నిర్ణయమవుతుందని వెలింగ్కర్ తెలిపారు.