NGT orders
-
పోలవరంపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ డంపింగ్ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌ను ఏకే గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాధానమిచ్చారు. దాంతో ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్లో వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని, పోలవరం డంపింగ్ కేసుతో పాటే వరద ముంపు పిటిషన్‌ను కూడా విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది. -
పాత డీజిల్ కార్లను పట్టుకెళ్లిపోతున్నారు!!
న్యూఢిల్లీ : పొద్దున్న ఆరు అయినా కూడా చీకటి మబ్బులు దుప్పటి తెరవని రోజులు రాబోతున్నాయి. దీంతో ఓ వైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం దేశ రాజధానిని పట్టి పీడించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు ప్రారంభించింది. 15 ఏళ్లకు పైబడిన వాహనాలు రోడ్లపైకి ఎక్కకుండా ఉండేందుకు ఆ వాహనాలను డీరిజిస్ట్రర్ చేయడం, రద్దు చేయడం చేస్తోంది. సీజ్ చేసి పట్టుకెళ్లిన వాహనాలను తిరిగి యజమానులకు ఇవ్వకూడదని కూడా ఢిల్లీ రవాణా శాఖ ఆలోచిస్తోంది. సీజ్ చేసిన, రద్దు చేసిన వాహనాలను ప్రభుత్వ రంగ ఎంఎస్టీసీ లిమిటెడ్‌కు అప్పజెప్పబోతున్నారు. అంతేకాక ఆ వాహనాలు వాడిన యజమానులకు మున్సిపల్ కార్పొరేషన్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు కలిసి అదనంగా జరిమానాలు కూడా విధించబోతున్నాయి. ‘మరికొన్ని రోజుల్లో శీతాకాలం ప్రారంభం కాబోతుంది. కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోబోతుంది. దీంతో 15 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను సీజ్ చేసే డ్రైవ్ ప్రారంభించాం. పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేసినా, ఇళ్లలో ఉన్నా వీటిని తీసుకెళ్లిపోతాం. ఇతర వాహనాల విషయంలో పొల్యుషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్లు ఉన్నాయో లేవో తమ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ పరిశీలించనున్నాయి’ అని రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోట్ చెప్పారు. ప్రభుత్వ డేటా ప్రకారం ఢిల్లీలో కోటికి పైగా రిజిస్ట్రర్ వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 ఏళ్లకు పైబడినవి 3,70,000. 15 ఏళ్లకు పైబడినవి రోడ్లపై తిరగడానికి వీలులేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆర్డర్‌తో 2016 జనవరి నుంచి ఇప్పటి వరకు 2,23,000 డీజిల్ వాహనాలను డీరిజిస్ట్రర్ చేశారు. ఎన్జీటీ ఆర్డర్ ప్రకారం వాటిని పబ్లిక్ ప్రాంతాల్లో పార్క్ చేయడానికి కూడా వీలు లేదు. ఢిల్లీలో చాలా ఇళ్లలో సొంత పార్కింగ్ స్థలం లేదు. యజమానులు ఈ వాహనాలను ఢిల్లీ వెలుపల అమ్మేయాల్సి ఉంది. అయితే అమ్మేయకుండా అలానే ఉంచుకుని, రోడ్లపైకి తీస్తున్న ఆ వాహనాలను ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకుపోతున్నారు. రోడ్లపై ఉన్నా.. పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్నా.. ఇళ్లలో ఉన్నా వీటిని రవాణా శాఖ సీజ్ చేస్తోంది. -
ఎన్జీటీ ఉత్తర్వులపై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పనులన్నింటినీ ఆపేయాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులను కూడా కొనసాగించరాదని, పనులన్నింటినీ వెంటనే నిలిపేయాలంటూ ఈ నెల 5న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వుల వల్ల రోజుకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందంటూ ప్రభుత్వం, నీటిపారుదలశాఖ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఎన్జీటీలో ఫిర్యాదు చేసిన హయత్ ఉద్దీన్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ శుక్రవారం వాదనలు కొనసాగిస్తూ, తాము దాఖలు చేసిన ఫిర్యాదును విచారించే పరిధి ఢిల్లీలోని ఎన్జీటీకి ఉందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చెన్నైలో ఉన్న ఎన్జీటీ ధర్మాసనానికే విచారణార్హత ఉందని తెలిపారు. డిజైన్ మారినంత మాత్రాన కొత్త ప్రాజెక్ట్ అనడానికి వీల్లేదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. -
అనుమతులు వస్తే వెబ్సైట్లో ఏదీ?
- ఏపీ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించిన ఎన్జీటీ - రాజధానికి అనుమతుల పత్రాన్ని వెంటనే వెబ్సైట్లో ఉంచాలని ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వాటిని వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఘాటుగా ప్రశ్నించింది. వాటిని వెంటనే వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి ప్రాజెక్టులో నిర్మాణాలు, చదును పనులు చేపట్టరాదన్న ఎన్జీటీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. వారం రోజుల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. అమరావతి నిర్మాణం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని వివిధ అంశాలను లేవనెత్తుతూ కృష్ణా జిల్లా వాసి పండలనేని శ్రీమన్నారాయణ గతంలో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్టోబర్ 10న విచారణ జరిగిన సందర్భంలో ఎన్జీటీ.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, చదును చేసే కార్యక్రమాలు కూడా చేయరాదని ఆదేశించింది. విచారణ అనంతరం కొద్దిరోజులకు ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (సియా) అనుమతి ఇచ్చిందని చెబుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఇది అవాస్తవమని కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్ గురువారం మరో పిటిషన్ దాఖలు చేశారు.ఇవి గురువారం జస్టిస్ యూడీ సాల్వీ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. పిటిషనర్ తరపు న్యాయవాదులు సంజయ్ ఫారిఖ్, పారుల్గుప్తా, కె.శ్రవణ్‌కుమార్ తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సాల్వీ ‘అనుమతుల ప్రతి ఇవ్వడానికి మీకొచ్చిన ఇబ్బందేమిటి? అనుమతుల కాపీ లేకుండా అనుమతులు వచ్చాయంటే ఎలా? కాపీ ఇవ్వనప్పుడు మీపై చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్టే కదా?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు గురుకృష్ణకుమార్, గంగూలీ, గుంటూరు ప్రభాకర్ సమాధానమిస్తూ సాంకేతిక సమస్య వల్లే వెబ్సైట్లో పొందుపరచలేకపోయామని చెప్పారు. శుక్రవారం నాటికి వెబ్సైట్లో పొందుపరుస్తామని విన్నవించారు. న్యాయమూర్తి అనుమతిం చారు.తమ స్పందనకు సమయం కావాలన్న కేంద్ర పర్యావరణశాఖ విజ్ఞప్తి మేరకు వచ్చే సోమవారం వరకు సమయం ఇచ్చారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.