డేంజర్ జర్నీ!
రోడ్డెక్కితే చాలు.. అడుగడుగునా ప్రమాద భయం..! కండిషన్ లేని వాహనాలు.. వాటిని నడిపే డ్రైవర్లకు మద్యం మత్తు లేదంటే నిద్రమత్తు.. వాహనంలో అపరిమిత లోడు.. కారణాలేవైనా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీపై శనివారం జరిగిన దుర్ఘటనలో 23 ప్రాణాలు హరీమన్నాయి. మన జిల్లాలోనూ ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా రవాణాశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
సాక్షి, గుంటూరు : వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే రాజ్యలక్ష్మి, శివమ్మ అనే తల్లీ కూతుళ్లు ఈ నెల 11వ తేదీ రాత్రి మంగళగిరి సమీపంలోని హ్యాపీక్లబ్లో జరిగే వివాహానికి హాజరై ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చారు. కళ్లు మూసి తెరిచేలోగా ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టి వెళ్లింది. దీంతో ఆ కుటుంబం వీధుల పాలైంది.
► జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్థులు విజయవాడలోని ఓ కళాశాలలో చదువుతున్నారు. స్నేహితుని ద్విచక్ర వాహనం తీసుకుని గుంటూరుకు వచ్చారు. కొరిటెపాడు సెంటర్లో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇరువురూ మృత్యు ఒడిలోకి చేరారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. ఇలా నిత్యం జిల్లాలో ఎవరో ఒకరు, ఎక్కడో ఓ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు.
► కొందరు చేజేతులా ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు ఇతరుల నిర్లక్ష్యంవల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వీటన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగానూ మద్యం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ తర్వాత రహదారుల దుస్థితి, అధికారులు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఏటా ప్రమాదానికి గురై మృత్యువాత పడే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.
హైవేల్లో ఎనీటైమ్ మద్యం..
లారీలు, ఆటోల ప్రమాదాలకు మద్యపానమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పట్టణాల్లో అర్ధరాత్రి వేళల్లోసైతం మద్యం విక్రయాలు యదేచ్ఛగా జరుగుతుండగా హైవేల్లో మాత్రం 24 గంటలూ మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఎన్హెచ్-5 కృష్ణానది నుంచి చిలకలూరిపేట వరకు ఉంది. మొత్తం హైవే 70 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఈ దారిలో ప్రతి ఐదు, పది కిలోమీటర్ల మార్గంమధ్యలో దాబాల్లో, మద్యం దుకాణాలలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి.
ఆటోలు, లారీడ్రైవర్లు రోడ్డు పక్కనే వాహనాలు నిలుపుకొని మద్యం తాగడం నిత్యకృత్యంగా మారుతోంది. ఈ తంతు తెలిసినా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గుంటూరు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాస్తున్న అధికారులు హైవేలపై లారీ డ్రైవర్లను ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల కూడా డ్రైవర్లు ఇష్టారాజ్యంగా మద్యం సేవిస్తూ వాహనాలు నడుపుతున్నారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిలోనే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
మొక్కుబడిగా భద్రతా కమిటీ..
రహదారుల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రహదారి భధ్రతా కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలో జిల్లా ఎస్పీ, ఎన్హెచ్-5 అధికారులు, జీజీహెచ్ సూపరింటెండెంట్, రవాణాశాఖా అధికారులు, ఆర్టీసీ అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రహదారుల ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన ఈ కమిటీ సభ్యులు మొక్కుబడి సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.