జాతీయ రహదారి పనులపై జేసీ సమీక్ష
ఏలూరు సిటీ : జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ పనులు నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని, జాతీయ రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జాతీయ రహదారులు, రైల్వే అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జాతీయ రహదారులను ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కు అంతరాయం లేని విధంగా పనులు చేపట్టాలన్నారు. రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా ప్రయాణానికి అనువుగా ఉండేలా చూడాలన్నారు. వచ్చిన బడ్జెట్ ఆధారంగా జిల్లాలో ప్రాధాన్యత ప్రకారం రహదారుల పనులు చేపట్టాలని ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మలను ఆదేశించారు. చేపట్టే పనుల్లో ఏది ముఖ్యమో గుర్తించి ఆయా పనులకు మొదటి ప్రాధాన్యతనిచ్చి పనులు చేపట్టాలన్నారు. రైల్వే అభివృద్ధి పనులపై సమీక్షిస్తూ దువ్వాడ–విజయవాడ మూడో రైల్వే లైన్ ఎందుకు అవసరమో ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో సమగ్ర వివరాలతో ఒక నివేదిక తయారు చేసి సోమవారంలోగా ఇవ్వాలని రైల్వే అధికారులను జేసీ ఆదేశించారు. చింతలపూడి లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే పనులు చాలా మందకొడిగా జరుగుతున్నాయని ఏలూరు ఆర్డీవో చక్రధరరావు జేసీ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ అవసరమైతే సర్వే టీములను, సూపర్వైజర్లను పెంచి సర్వే పనులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏజేసీ ఎంహెచ్.షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, భూసేకరణ డెప్యూటీ కలెక్టర్ భానుప్రసాద్, ఐటీడీఏ పీవో షాన్మోహన్, ఆర్డీవో జి.చక్రధరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, భూసేకరణ అధికారులు ఏవీ సూర్యనారాయణ, పుష్పమణి, పోలవరం ఎస్ఈ శ్రీనివాసయాదవ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రంగలక్షి్మదేవి తదితరులు పాల్గొన్నారు.