‘అమ్మ ఒడి’పైనే తొలి సంతకం
* అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేస్తాం
* ముఖ్యమంత్రి కాగానే నాలుగు సంక్షేమ పథకాలపై సంతకం చేస్తా
* వృద్ధుల పెన్షన్ రూ. 700కు పెంచుతాం
* రూ. 3 వేల కోట్లతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం
* అక్క చెల్లెళ్ల కోసం డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ నాయకులు ఏ గడ్డయినా తినే పరిస్థితులను ఈరోజు చూస్తున్నాం. ఓట్ల కోసం, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయం అంటే ప్రతిపేదవాడి గుండెల్లో చిరునవ్వు చూడాలి. ఈ వ్యవస్థలో మార్పును తీసుకొస్తాం. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడదాం. మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున నాలుగు సంతకాలు పెడతా. ఈ సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేలా ఉంటాయి. మొదటి సంతకం అక్కచెల్లెళ్ల పిల్లలను చదివించే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం గురించి చేస్తా. ఈ పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ.1000 వేస్తాం. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెన్షన్‌ను రూ.700 పెంచడానికి చేస్తా. మూడో సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం చేస్తా. నాలుగో సంతకం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాల మాఫీ కోసం చేస్తాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గణేశ్ చౌక్ సెంటర్లో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
చంద్రబాబు పాలన మరచిపోలేం..
‘‘ఒక వ్యక్తి చనిపోయి ఐదు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎక్కడున్నారని ఎవరినైనా అడిగితే గుండెలు చూపించి మా గుండె లోతుల్లో ఉన్నాడని చెబుతారు. రామరాజ్యం నేను చూడలేదు కానీ ఆ దివంగత నేత సువర్ణయుగాన్ని మాత్రం చూశాను. ఆ దివంగత నేతకు ముందు రాష్ట్రాన్ని చంద్రబాబు అనే వ్యక్తి పరిపాలించేవారు. ఆ భయానక పాలనలో గ్రామాలకు వెళ్లినప్పుడు అవ్వాతాతలు.. అయ్యా పెన్షన్ ఇప్పించమని అడిగేవారు. వారి కష్టాలు చూడలేక అధికారులకు ఫోన్ చేస్తే.. గ్రామంలో 15 మందికో, 20 మందికో ఉన్న కోటా పూర్తయిందని వారిలో ఎవరైనా చనిపోతేగానీ కొత్త వారికి పెన్షన్ ఇవ్వలేమని చెప్పడం నాకు గుర్తుంది. పిల్లలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా వారిని చంద్రబాబు సీఎం స్థానంలో ఉండి ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపానపోలేదు. హఠాత్తుగా ఎవరికైనా గుండెనొప్పో, ఇంకో రోగమో వస్తే ఆస్పత్రుల్లో రూ.2 లక్షలు ఫీజు అడిగేవారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత వడ్డీకైనా అప్పుతెచ్చి కట్టేవారు. కానీ దాన్ని తీర్చడానికి జీవితాంతం వారు ఊడిగం చేయడం నాకు గుర్తుంది.
రైతు ఆత్మహత్యల్ని బాబు అవహేళన చేశారు..
ఆ భయానక పాలనలో చంద్రబాబు ఓట్ల కోసం, సీట్ల కోసం డ్వాక్రా అక్క చెల్లెళ్లను ఉపయోగించుకున్నారు. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని రోజులవి. రైతన్నలు పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులవి. వారి కోసం ఉద్యమాలు జరిగాయి. అప్పుడు రైతన్నల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, నష్టపరిహారం ఇప్పించాలని అడిగితే.. అలా చేస్తే ఆ డబ్బుల కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు అవహేళన చేశారు. రైతులు తిన్నది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎగతాళి చేశారు.
వైఎస్.. వెలుగు రేఖలా వచ్చారు..
అలాంటి సమయంలో దివంగత మహానేత వైఎస్ వెలుగు రేఖలా వచ్చారు. ప్రతి పేదవాణ్ణి పేదరికం నుంచి బయట పడేయడానికి ఆయన ముందుకొచ్చారు. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా ఇంజినీర్ కావాలని, డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఆ పిల్లల ఫీజులు ప్రభుత్వమే కట్టేలా చేశారు. పేదవాడికి రోగం వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. అప్పులు తెచ్చి రూ.2 లక్షలు కట్టాల్సిన పరిస్థితి లేకుండా చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో వారికి ఉచితంగా ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపేలా చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. పేదవాడికి గుండెపోటు వస్తే 108 నెంబరుకు ఫోన్ చేస్తే చాలు కుయ్.. కుయ్.. కుయ్‌మని అంబులెన్స్ వచ్చేది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పేదలకోసం ఎవరైనా పనిచేశారని అంటే ఆయన దివంగత మహానేత రాజశేఖరరెడ్డి మాత్రమే. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఈ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు.
రెండు నెలల్లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడదాం..
ఓట్లు, సీట్ల కోసం నాయకులు ఏ గడ్డయినా తినే పరిస్థితులను చూస్తున్నాం. ఓట్ల కోసం, సీట్ల కోసం దొంగ కేసులు పెట్టడానికి, ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించే రాజకీయ వ్యవస్థను మనం చూస్తున్నాం. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయం అంటే ప్రతిపేదవాడి గుండెల్లో చిరునవ్వు చూడాలి. ఈ వ్యవస్థలో మార్పును తీసుకొస్తాం. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడదాం. మరో రెండు నెలల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసే రోజున నాలుగు సంతకాలు పెడతా. ఈ సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేలా ఉంటాయి. మొదటి సంతకం అక్కచెల్లెళ్ల పిల్లలను చదివించే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం గురించి చేస్తా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెన్షన్‌ను రూ.700 పెంచడానికి చేస్తా. మూడో సంతకం రైతులకు గిట్టుబాటు ధర కల్పించే రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం చేస్తా. నాలుగో సంతకం అక్కచెల్లెమ్మల డ్వాక్రా రుణాల మాఫీ కోసం చేస్తాం. ఇవే కాదు. రాజధాని కోసం మనం ఉద్యమం చేయాల్సి ఉంది. మన రాజధానిని నిర్మించుకునేందుకు ఉద్యమం చేద్దాం.’’
అడుగడుగునా జనహోరు
వైఎస్ జగన్ రెండో రోజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన రోడ్‌షోకు జనహారతి పట్టారు. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో రోడ్ షో మొదలైనప్పటి నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. దూబచర్లలో ఊరూరంతా జగన్‌ను చూసేందుకు రోడ్డుపైకి రావడంతో కోలాహలంగా మారింది. అక్కడి నుంచి ఆరు కిలో మీటర్లు దూరంలో ఉన్న నల్లజర్ల చేరుకోడానికి జన నేతకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రతిచోటా మహిళలు, యువకులు ఆయన్ను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. అనంతపల్లి, యర్నగూడెం, కోరుమామిడి మీదుగా రాత్రి 8.30 గంటలకు జగన్ నిడదవోలు సభ వద్దకు చేరుకున్నారు. సభకు వచ్చిన జనసంద్రంతో నిడదవోలు గణేశ్‌చౌక్ సెంటరులోని నాలుగు రోడ్ల కూడలి కిక్కిరిసిపోయింది. ఈ సభలో పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కృష్ణబాబు, జిల్లా నాయకులు రాజీవ్ కృష్ణ, తలారి వెంకట్రావు, తోట చంద్రశేఖర్, తూర్పు గోదావరి జిల్లా నాయకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన జీఎస్ రావు
జనభేరి సభలోనే పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు, ఆయన కుమారుడు శ్రీనివాసనాయుడు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నిడదవోలు ఎమ్మెల్యేగా యువకుడైన రాజీవ్ కృష్ణను, ఎంపీగా బొడ్డు వెంకట్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.
నేడు ఖమ్మంలో ‘వైఎస్ఆర్ జనభేరి’
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలో ‘వైఎస్ఆర్ జనభేరి’ సభ నిర్వహించనున్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుంచి సత్తుపల్లి మండలం గంగారం మీదుగా జగన్ ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. సత్తుపల్లి, వైరా మీదుగా ఖమ్మం వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో సాయంత్రం నాలుగు గంటలకు ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు. తెలంగాణలో తొలిసభ కావడంతో పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.