భవిష్యత్తు ఫ్యాషన్ రంగానిదే
ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ
నిఫ్ట్‌లో ‘రిఫ్లెక్షన్-14’ సదస్సు ప్రారంభం
మాదాపూర్, న్యూస్‌లైన్: ఫ్యాషన్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతోందని, యేటా మూడువేల మంది ఫ్యాషన్ డిజైనర్లు నిఫ్ట్ ద్వారా బయటకు వస్తున్నారని ఐఐఎం కొజికోడ్ డెరైక్టర్ దెబాషిష్ ఛటర్జీ అన్నారు. మాదాపూర్ నిఫ్ట్ ఆడిటోరియంలో గురువారం ‘రిఫ్లెక్షన్స్-14’ పేరిట అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దెబాషిష్ హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. సదస్సులో భావితరాలకు ఏ విధమైన డిజైన్స్ అందించాలి, రిటైల్, మేనేజ్మెంట్ అంశాలపై చర్చించనున్నామన్నారు. నిఫ్ట్ డెరైక్టర్ ప్రేమ్‌కుమార్ గేర మాట్లాడుతూ నేటి తరం ఫ్యాషన్ రంగంపై మక్కువ చూపుపుతున్నారని, ఈ రంగంలో చేరేవారి సంఖ్య యేటా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. అనంతరం విద్యార్థులు తమ ఫ్యాషన్ మెళకువలను సంక్రాంతి ముగ్గులకు జోడించి ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు.