చిన్న వయసు సృజనశీలి
సంక్షిప్తంగా... ఝుంపా లహిరి
నీలాంజన సుధేష్ణ లహిరి. లండన్! సంప్రదాయం, అధునికత కలగలిసినట్లున్న ఈ పేరు, ఊరు ఝుంపా లహిరివి. రెండేళ్ల వయసులో కుటుంబంతో పాటు లండన్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఝుంపా అసలుకైతే బెంగాలీ అమ్మాయి. తన తొలి కథల సంకలనం ‘ఇంటర్ప్రెటర్ ఆఫ్ మాలాడీస్’కు పులిట్జర్ అవార్డు గెలుచుకోవడం ద్వారా పద్నాలుగేళ్ల క్రితం తొలిసారి ప్రపంచం దృష్టికి వచ్చిన ఝంపా ప్రస్తుతం అమెరికాలోని ‘ప్రెసిడెంట్స్ కమిటీ’ (ఆర్ట్ అండ్ హ్యుమానిటీస్) లో సభ్యురాలు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఓబామా స్వయంగా ఝంపాను కమిటీ సభ్యురాలిగా నియమించారని అంటారు. పులిట్జర్ అవార్డు వచ్చిన మూడేళ్లకు ఝంపా రాసిన తొలి నవల ‘ది నేమ్‌సేక్’ పుస్తకంగానూ, సినిమాగానూ అనేక ప్రశంసలు, అవార్డులు అందుకుంది. సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించగా అమెరికన్ నటుడు కాల్ పెన్, బాలీవుడ్ నటులు ఇర్ఫాన్‌ఖాన్, టబూ నటించారు. గత ఏడాది ఝంపా రాసిన ‘ది లోల్యాండ్’ నవల కూడా విమర్శకుల మన్నన అందుకున్నదే..
ఝంపా రోడ్ ఐలాండ్‌లోని కింగ్‌స్టన్‌లో పెరిగారు. ఆమె తండ్రి అమర్ లహిరి రోడ్ ఐలాండ్ యూనివర్శిటీలో లైబ్రేరియన్. ఝంపాకు అమెరికా అంటే ఇష్టం. ‘‘లండన్‌లో పుట్టినప్పటికీ అమెరికన్‌గా చెప్పుకోడానికే నేను ఇష్టపడతాను’’ అని ఆమె అంటారు. అయితే ఝంపా తల్లికి తన పిల్లలు బెంగాలీ సంప్రదాయంలో పెరగాలని ఆశ. అందుకే ఆవిడ తరచు బెంగాల్‌కి ప్రయాణాలు పెట్టుకునేవారు. ఝుంపాకు నీలాంజన సుధేష్ణ అనే పేరు ఎంపిక చేయడంలో ఆమె తల్లి ప్రమేయమే ఎక్కువగా ఉంది. అయితే అలా పిలవడానికి, వినడానికి అమెరికాలో కష్టంగా ఉంటుందని తండ్రి ఆమెకు ఝుంపా అని ముద్దుపేరు పెట్టుకున్నారు. ఝంపా అంటే ‘ముద్దుపేరు’ అని అర్థం. ఇలా ఏ అర్థమూ లేని ఈ పేరంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఒక ఇంటర్వ్యూలో ఝంపా వాపోయారు కూడా.
ఝుంపా ఇంగ్లిష్ లిటరేచర్‌లో బి.ఎ. చేశారు. తర్వాత ఎం.ఎ. ఇంగ్లిష్, క్రియేటివ్ రైటింగ్‌లో ఎం.ఎఫ్.ఎ., ఇంకా... కంపారిటివ్ లిటరేచర్‌లో ఎం.ఎ., చేశారు. తర్వాత రినెసైన్స్ (పునరుజ్జీవనోద్యమం) స్టడీస్‌లో పిహెచ్.డి చేశారు. అనంతరం ప్రావిన్స్‌టౌన్ ఫైన్ ఆర్ట్స్ వర్క్ సెంటర్లో రెండేళ్ల పాటు (1997-98) ఫెలోషిప్ తీసుకున్నారు. బోస్టన్ విశ్వవిద్యాలయం, రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్‌లో క్రియేటివ్ రైటింగ్‌పై పాఠాలు చెప్పారు.
2001లో ఝంపా ఆల్బెర్టో వర్వోలియాస్-బుష్‌ను వివాహమాడారు. ఆయన జర్నలిస్టు. అప్పట్లో ఆయన ‘టైమ్’ పత్రిక లాటిన్ అమెరికా విభాగానికి డిప్యూటీ ఎడిటర్‌గా ఉండేవారు. ఇప్పుడు సీనియర్ ఎడిటర్ అయ్యారు. ఇద్దరు పిల్లలు. ఆక్టావియో, నూర్. అంతా కలిసి రోమ్‌లో ఉంటున్నారు. ప్రిన్స్టన్ యూనివర్శిటీలోని ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్లో సృజనాత్మక రచనా విభాగం ప్రొఫెసర్‌గా ఈ నెల 1 నుంచి బాధ్యతలు చేపట్టడానికి ఝుంపా ఇటీవలే మళ్లీ అమెరికా చేరుకున్నారు. ఇవాళ ఝంపా పుట్టినరోజు.