గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో అత్యుత్సాహం వద్దు
కర్నూలు(టౌన్): కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో యువకులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా పోలీసుల ఆంక్షలను పాటించాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. శనివారం రాత్రి స్థానిక కొత్తపేటలో సాయి విఘ్నేష్ భక్త బందం ఆధ్వర్యంలో వినాయక విగ్రహం వద్ద ఎస్పీ దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మ అంధుల పాఠశాల విద్యార్థులకు, జొహరాపురం వద్ద ఉన్న మాతాశ్రీ అన్నపూర్ణేశ్వరి ట్రస్టు అనాథపిల్లలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ మతసామరస్యానికి పాటుపడాలన్నారు. జిల్లా పోలీసులు చేపట్టిన నేత్రదాన కార్యక్రమానికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో రెండవ పట్టణ సీఐ ములకన్న, సాయి విఘ్నేష్ భక్త బందం నిర్వాహకులు అశోక్‌కుమార్, చరణ్, రాజేంద్ర, గంగాధర్, లోకేంద్ర, కొత్తపేట కాలనీ వాసులు పాల్గొన్నారు.