ముహూర్తం ఖరారు
25న బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. స్థానికులకు తక్షణ వైద్యం అందించే చర్యల్లో భాగంగా ఈ నెల 25న ఓపీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో గైనిక్, ఆర్థో, పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి సేవలు అందుబాటులో ఉం టాయి. ఆ తర్వాత ఇన్‌పేషంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి పంజగుట్ట నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులనే ఇందుకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. బీబీనగర్‌లో ఓపీ ప్రారంభంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
నాలుగు అంతస్తుల్లో నాలుగు వందల పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో 4 ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాలకు 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్ అవసరం. కానీ ఇప్పటివరకు నియా మకాలు చేపట్టలేదు. దీంతో దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలి దశలో బేసిక్ (ఆర్థోపెడిక్స్, గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ) ఓపీ వైద్య సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు.